ప్రత్యామ్నాయం పత్తి, కంది.. వరి సాగు తగ్గించండి.. వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళిక

ప్రత్యామ్నాయం పత్తి, కంది.. వరి సాగు తగ్గించండి.. వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళిక
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలన్న వ్యవసాయశాఖ
  • జులై 31 వరకు వర్షాలు పడ్తే పత్తి, కంది, జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు వేసుకోవాలి
  • ఆగస్టు 1-15 మధ్య కురిస్తే.. కంది, కొర్రలు, కూరగాయల సాగు మంచిది
  • జులై 14 నాటికి రాష్ట్రంలో 30.5 శాతం లోటు వర్షపాతం
  • ఎల్‌‌నినో ప్రభావంతో వానాకాలం అత్యవసర ప్రణాళిక విడుదల
  • జిల్లాలవారీగా సమగ్ర కార్యాచరణ 
  • పడిన వానను బట్టి పంట సాగు చేసుకుంటే నష్టాలు తగ్గుతాయని సూచన

 హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వానాకాలం సాగు అర్ధంతరంగా ఆగిపోయింది. జులై రెండోవారం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అసలు పంటలు 
సాగుచేయాలా?  వద్దా? చేస్తే ఎలాంటి పంటలు వేయాలో తెలియక రైతాంగం తలపట్టుకుంటోంది. దీంతో అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ‘అత్యవసర ప్రణాళిక’ సిద్ధం చేసింది. ఎప్పుడు వర్షాలు పడితే ఏ పంట సాగు చేయాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో రైతులు వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో సాగయ్యే పత్తి, కంది, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. జిల్లా, మండల స్థాయిలో వర్షపాతం, నేలల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా ప్రతి జిల్లాకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. "వర్షాల కోసం ఎదురుచూడకుండా.. పడిన వానను బట్టి పంట మార్చుకుంటేనే నష్టాలు తగ్గుతాయి" అని సూచిస్తోంది. 

ఇప్పటికే 30.53 శాతం లోటు వర్షపాతం

జూన్​ 1 నుంచి జులై 14 వరకు రాష్ట్రంలో సాధారణంగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 158.4 మిల్లీమీటర్లే నమోదయ్యింది. అంటే 30.53 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను ములుగు, రంగారెడ్డి, నాగర్‌‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం రికార్డు అయ్యింది. హనుమకొండ జిల్లా.. అత్యధికంగా 65 శాతం లోటుతో విలవిలలాడుతోంది. మిగిలిన 27 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం రికార్డయ్యింది.పరిస్థితులు మరికొంత కాలం కొనసాగితే ఇప్పటికే సాగులో ఉన్న పంటలు దెబ్బతినడంతోపాటు ఇంకా పంటలు వేయని రైతులమీద తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 

స్వల్పకాలిక పంటలు మేలు..

రానున్న రోజుల్లో మంచి వానలు పడితే జూలై 31 వరకు పత్తి, కంది, జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఇంకా విత్తనాలు వేయని చోట వెంటనే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు. జూలై చివరి నాటికి కూడా తగినంత వర్షాలు పడకపోతే ఆగస్టు 1 నుంచి 15 మధ్య కంది, కొర్రలు, ఇతర చిరుధాన్యాలతో పాటు తక్కువ కాలంలో చేతికొచ్చే కూరగాయల సాగు చేయాలని , ఈ కాలంలో పత్తి లాంటి దీర్ఘకాలిక పంటల కంటే తక్కువ కాలంలో పండే పంటలే అనుకూలమని స్పష్టంచేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరిసాగు వీలైనంత వరకు తగ్గించాలని, బోర్లమీద ఆధారపడి అసలే సాగు చేయవద్దని వ్యవసాయశాఖ స్పష్టంచేసింది. నీటిని ఆదా చేస్తూ కంది, పెసర, మినుము, ఆముదం, పల్లి, పొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక వంగడాల ఎంపిక, అంతర పంటల సాగు, నేలలో తేమ నిల్వ చర్యలు, మల్చింగ్ వంటి పద్ధతులు పాటించాలని అధికారులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొత్తగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడమే కాకుండా ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాలు, ఇతర పంటలను ఎలా కాపాడుకోవాలో కూడా కంటింజెన్సీ ప్రణాళికలో  సూచించారు. 

66 లక్షల ఎకరాలపై ప్రత్యేక దృష్టి

ఈ సీజన్‌‌లో రాష్ట్రంలో సాధారణంగా 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ జూలై 14 నాటికి కేవలం 60.22 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. అంటే దాదాపు 66 లక్షల ఎకరాల్లో ఇంకా విత్తనాలు పడలేదు. పత్తి సాగు 87.57 శాతం, సోయాబీన్ 80.57 శాతం, పప్పుధాన్యాలు 63.27 శాతం మేర సాగవగా, వరి సాగు కేవలం 9.67 శాతానికే పరిమితమైంది. ఈ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణను వ్యవసాయ శాఖ రూపొందించింది. వర్షాల పరిస్థితిని బట్టి రైతులు వెంటనే నిర్ణయాలు తీసుకునేలా జిల్లా స్థాయిలో వ్యవసాయ అధికారులు ప్రత్యేక సలహాలు ఇవ్వనున్నారు.

భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటి నిల్వలపై ఆందోళన..

లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. మరోవైపు ప్రధాన జలాశయాల్లో నిల్వలు కూడా కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురవకపోతే సాగునీటి విడుదల కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జూన్ లో 9.46 మీటర్లుండగా, 30 శాతం లోటు వర్షపాతం ఇలాగే కొనసాగితే జూలై చివరికి 10.35 మీటర్లకు, ఆగస్టు నాటికి 11.01 మీటర్లకు పడిపోతుందని భూగర్భ జలాల శాఖ హెచ్చరించింది. వికారాబాద్ (15.60 మీటర్లు), మెదక్ (15.20 మీటర్లు), సంగారెడ్డి (15.09 మీటర్లు) జిల్లాల్లో నీటిమట్టం దారుణంగా పడిపోయే ప్రమాదముంది. మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్లలోని జలాశయాల నిల్వలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. కృష్ణా బేసిన్‌‌లో ప్రాజెక్టుల నిల్వ కేవలం 14.81 టీఎంసీలకు, గోదావరి ప్రాజెక్టుల్లో 27.69 టీఎంసీలకు పరిమితమైంది. ఈ నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటి విడుదల సాధ్యం కాదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. 

రైతులకు ముందస్తు హెచ్చరిక

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాష్ట్రంలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూడకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వర్షాలు పడే సమయాన్ని బట్టి పంట ఎంపికలో మార్పులు చేసుకుంటే దిగుబడులను కాపాడుకోవచ్చని అంటున్నారు. 

ఎప్పుడు.. ఏ పంట వేయాలంటే

  • జులై 16-31 మధ్య వర్షాలు పడితే:
  • పత్తి, కంది, జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు
  • ఆగస్టు 1-15 మధ్య:
  • కంది, కొర్రలు, ఇతర చిరుధాన్యాలు, కూరగాయలు
  • జూన్​ 1 నుంచి జులై 14 నాటికి 
  • వర్షాల పరిస్థితి:
  • సాధారణ వర్షపాతం: 228 మి.మీ
  • నమోదైన వర్షపాతం: 158.4 మి.మీ
  • లోటు: 30.53%
  • అత్యధిక వర్షపాతం: ములుగు - 298.5 మి.మీ
  • అత్యల్పం: జోగులాంబ గద్వాల - 65.4 మి.మీ
  • రాష్ట్రంలో సాగు పరిస్థితి:
  • సాధారణ సాగు విస్తీర్ణం: 1.32 కోట్ల ఎకరాలు
  • సాగైన విస్తీర్ణం: 60.22 లక్షల ఎకరాలు
  • సాగు మిగిలిన భూమి: సుమారు 66 లక్షల ఎకరాలు
  • రైతులకు ఇచ్చే సూచనలు
  •   వరి సాగును వీలైనంత తగ్గించాలి
  •   తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలి
  •   స్వల్పకాలిక వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
  •   నేలలో తేమ నిల్వ చర్యలు చేపట్టాలి
  •   స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట ఎంపిక చేసుకోవాలి