- దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థులు క్వాలిఫై
- 715 మార్కులతో ఇద్దరు టాపర్లు తెలంగాణ నుంచి
- సహ్యుకు 13, సాయి శరణ్‌కు19, కందగట్ల హనీశ్‌కు 21 ర్యాంకు
హైదరాబాద్, వెలుగు: నీట్-యూజీ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం ప్రకటించింది. వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సెలింగ్ షెడ్యూల్ కాలంలో సాగేలా ఈ ఫలితాలను నిర్ణీత గడువులోనే వెల్లడించారు. గత నెల 21న నీట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 11.21 లక్షల మంది మెడికల్, డెంటల్, ఆయుష్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. అభ్యర్థులందరి స్కోర్ కార్డులు ఎన్‌టీఏ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు.
ఉమ్మడి టాపర్లుగా ఆర్యన్ గుప్తా, పాన్షుల్
ఈ పరీక్షలో గరిష్టంగా 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించిన పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సల్ ఉమ్మడిగా ప్రథమ స్థానంలో నిలిచారు. టాప్ 20లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. వీరయ్యగారి సహ్యు 13వ ర్యాంకు, బూర సాయి శరణ్19వ ర్యాంకు సాధించారు. అలాగే రాష్ట్రానికి చెందిన కందగట్ల హనీశ్ అనే విద్యార్థి 21 ర్యాంక్ పొందాడు. మొత్తం అభ్యర్థులలో 19 మంది 700 కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 1,492 మంది 650 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు.
ఈ పరీక్షలో 690 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 138 మంది అభ్యర్థుల ప్రొఫైల్ పరిశీలిస్తే, వారిలో 93 శాతానికి పైగా అభ్యర్థులు మొదటి ప్రయత్నంలోనే ఈ అర్హత సాధించడం విశేషం. అంతేకాకుండా వీరిలో 99 శాతం మంది 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే కాగా, ప్రతిభ కనబరిచిన మెజారిటీ అభ్యర్థుల వయస్సు కూడా 17 నుంచి 19 ఏళ్ల మధ్యే ఉంది.
టాప్ 17లో తెలంగాణ విద్యార్థులు
దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించగా, కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ నుంచి అత్యల్పంగా 43 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్రాల వారీగా టాపర్లను గమనిస్తే లడఖ్ నుంచి జిగ్మెట్ యాంగ్చన్ లామో 530 మార్కులతో, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ధ్రువ్ త్రిపాఠి 606 మార్కులతో, లక్షద్వీప్ నుంచి ఫహ్మిదా అనీస్ 573 మార్కులతో ఆయా ప్రాంతాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ లిస్టులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మొత్తం 17 మంది స్టేట్ టాపర్లు 700 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించగా, 26 మంది 690 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 138 మంది టాప్ ర్యాంకర్లు దేశవ్యాప్తంగా 66 నగరాలకు చెందినవారు కాగా, 705 కంటే ఎక్కువ మార్కులు సాధించిన మొదటి 17 మంది ర్యాంకర్లు తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నారు.
కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థులు
ఈ పరీక్షలో జనరల్, ఓబీసీ- ఎన్‌సీఎల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులతో పాటు థర్డ్ జెండర్ అభ్యర్థుల వివరాలను ఎన్‌టీఏ వెల్లడించింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీలో 2.91 లక్షల మంది, ఓబీసీ -ఎన్‌సీఎల్ కేటగిరీలో 5.12 లక్షల మంది, ఎస్సీ విభాగంలో 1.59 లక్షల మంది, ఎస్టీ విభాగంలో 63,716 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (జనరల్-ఈడబ్ల్యూఎస్) నుంచి 95,026 మంది, పీడబ్ల్యూబీడీ విభాగం నుంచి 3,666 మంది, పీడబ్ల్యూడీ విభాగం నుంచి 303 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులు, పర్సంటైల్ వివరాలను కూడా విడుదల చేశారు.
అమ్మాయిలదే పైచేయి
అమ్మాయిలు ఈ పరీక్షలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం అర్హత సాధించిన అభ్యర్థులలో 58 శాతానికి పైగా వీరే ఉన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థినులలో 56.8 శాతం మంది అర్హత సాధించగా, పురుషులలో 55.1 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు.
కౌన్సెలింగ్ అలర్ట్.. నకిలీల పట్ల అప్రమత్తత
ఆలిండియా కోటా పరిధిలోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. రాష్ట్రాల కోటా సీట్ల భర్తీ బాధ్యతను ఆయా రాష్ట్రాల సంబంధిత అధికారిక కమిటీలు చూసుకుంటాయి. అభ్యర్థులు సమాచారం కోసం కేవలం neet.nta.nic.in, mcc.nic.in , రాష్ట్రాల కౌన్సిలింగ్ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలి. అడ్మిషన్లు ఇప్పిస్తామని, సీట్లు బ్లాక్ చేస్తామని లేదా మార్కులు పెంచుతామని ఫోన్ కాల్స్, సందేశాలు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసగించే ప్రయత్నం చేసేవారిని నమ్మవద్దని ఎన్‌టీఏ హెచ్చరించింది. ఎన్‌టీఏ ఎలాంటి డబ్బును గానీ లేదా అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను గానీ అడగదని స్పష్టం చేసింది. ఏవైనా అనుమానాస్పద సమాచారం లేదా సంప్రదింపులు ఎదురైతే neetug2026@nta.ac.in ఈమెయిల్ లేదా 011-40759000 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.
