- రెండో తరగతి హిందూ చిన్నారితో కల్మా చదివిస్తరా?
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ ఎడ్యుకేషన్ జిహాద్ తారస్థాయికి చేరిందని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలోని సైదాబాద్ సక్సెస్ స్కూల్ లో జరిగిన ఉదంతం విద్యావ్యవస్థలో జొరబడుతున్న మతపిచ్చికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
రెండో తరగతి చదువుతున్న ఒక చిన్నారి చేత కల్మా చదివించడంతోపాటు హోం వర్క్‌గా కల్మా, సూరా అల్-ఫాతిహాలను పుస్తకాల్లో రాసుకుని, నేర్చుకుని రావాలని యాజమాన్యం ఆదేశించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్య నేర్పాల్సిన చోట మత మార్పిడి ముసుగులో ఇలాంటి పనులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక టీచర్‌ను తొలగించి చేతులు దులుపుకుంటే సరిపోదని, స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కొన్ని కాన్వెంట్ స్కూళ్లలో హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని రాకూడదని, మతాచారాలను పాటించకూడదని ఒత్తిడి చేస్తున్నారని రాంచందర్ రావు ఆరోపించారు. విద్యా సంస్థలు విద్యను అందించాలే తప్ప, మతాన్ని రుద్దే కేంద్రాలుగా మారకూడదని అన్నారు
