- వచ్చే విద్యాసంవత్సరంలో 50 వేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యం
- జర్మన్, జపనీస్ భాషల శిక్షణ కోసం ‘ఇఫ్లూ’తో ఒప్పందం
- ఈ నెల 26 నుంచి ఆగస్టు 30 వరకు మరో విడత మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడి
- ఆదివాసీ భవన్‌లో ‘తెలంగాణ స్కిల్స్ డే’వేడుకలకు హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)తో అద్భుత సత్ఫలితాలు వస్తున్నాయని, స్కిల్స్ పరంగా తెలంగాణ విద్యార్థులు దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రాన్ని నంబర్-1 స్కిల్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ జాబ్‌మేళాల ద్వారా ప్రభుత్వ ఏటీసీల నుంచి ఉద్యోగాలు సాధించిన యువతకు మంత్రి ఆఫర్ లెటర్లను అందజేసి, అభినందించారు. అలాగే విదేశీ ఉపాధికి ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు కూడా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 26 నుంచి ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో రెండో విడత మెగా జాబ్ మేళాలు నిర్వహించి, మరో 10 వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత యువతకు సైతం ఈ ఆధునిక శిక్షణను చేరువ చేసేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 54 ఏటీసీల ఏర్పాటు కోసం 281.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఏకంగా 50 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
99 శాతం సీట్లు భర్తీ..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ దేశీ విదేశీ పరిశ్రమ అయినా మొదట అడిగేది స్కిల్డ్ మ్యాన్‌పవర్ గురించేనని మంత్రి వివేక్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అత్యాధునిక ఏటీసీలుగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
వీటి ద్వారా సీఎన్‌సీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి వినూత్న విభాగాల్లో 6 దీర్ఘకాలిక, 23 స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. ఈ చారిత్రాత్మక సంస్కరణల వల్ల రాష్ట్రంలో సాంకేతిక శిక్షణ సామర్థ్యం 18,484 నుంచి ఏకంగా 34,344కు పెరిగిందని తెలిపారు. 2025-–27 విద్యా సంవత్సరంలో ఏకంగా 99 శాతం సీట్లు భర్తీ కావడమే యువతకు ఈ కోర్సులపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
జర్మనీ లాంటి దేశాల్లో ఏటా లక్షలాది మంది నైపుణ్యం గల ఉద్యోగుల అవసరం ఉందని, ఈ అవకాశాన్ని మన యువత అందుకోవాలని సూచించారు. అందుకోసం విదేశీ భాషలైన జర్మన్, జపనీస్ తదితర భాషల్లో ఉచిత శిక్షణ అందించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
1,775 మందికి కొలువులు.. రూ.2 వేల స్టైపెండ్..
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక శిక్షణ, జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1,775 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని మంత్రి వివేక్ వెల్లడించారు. హైదరాబాద్, ఉట్నూర్, వరంగల్, నిజామాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన 7 జాబ్‌మేళాల్లో 116 అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొన్నాయని, ఎంపికైన యువతకు సగటున నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం అందనుందని తెలిపారు.
ఐటీఐ, ఏటీసీ విద్యార్థులందరికీ నెలకు రూ.2,000 చొప్పున స్టైపెండ్ అందించనున్నట్లు వెల్లడించారు. నైపుణ్య శిక్షణ విభాగానికి నిధుల కొరత రానివ్వబోమన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రస్థాయి స్కిల్ కాంపిటీషన్లను నిర్వహించి ప్రతిభావంతులను సత్కరిస్తామని, విద్యార్థులంతా అలుమ్నీ నెట్‌వర్క్‌గా ఏర్పడి ఉపాధి సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సూచించారు.
