- రెండో రోజు 20 మంది డీసీసీ చీఫ్‌లతో వన్ టూ వన్ భేటీ
- జిల్లాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కొందరు డీసీసీల ఫిర్యాదు
- ఎవరు సహకరించక పోయినా.. మీ బాధ్యతను నిర్వర్తించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై నిశితంగా గమనించాలని డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. సర్ ముగిసే వరకు సర్కే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత పార్టీ బలోపేతంపై, ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని డీసీసీ అధ్యక్షులను మీనాక్షి నటరాజన్ కోరారు. డీసీసీ అధ్యక్షులతో గురువారం గాంధీ భవన్‌లో రెండో రోజు వన్ టూ వన్ భేటీ కార్యక్రమం కొనసాగింది.
మొదటి రోజున 19 మందితో భేటీ అయిన మీనాక్షి.. రెండో రోజున 20 మందితో భేటీ అయ్యారు. దీంతో మొత్తం 39 మంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో ఆమె వన్ టూ వన్ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్క డీసీసీ చీఫ్‌తో మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్క ఓటు జాబితా నుంచి తొలగించకుండా చూసుకోవాలని, బీఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సర్ ముగిసే వరకు అందరి ఫోకస్ దీనిపైనే ఉండాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. సర్ ముగిసిన తర్వాత బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాల సక్సెస్‌పై దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షులుగా మీ ప్రోగ్రెస్ ఏమిటి, రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటని డీసీసీ అధ్యక్షులను ఆరా తీశారు.
జిల్లాకు డీసీసీనే బాస్
మీ జిల్లాలో డీసీసీ అధ్యక్షులుగా మీకు పార్టీ ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి, పార్టీ సీనియర్ నేతల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది, వారితో మీ సమన్వయం ఎలా సాగుతోంది, పార్టీ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, నేతల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయా.. వంటి విషయాలపై మీనాక్షి ఆరా తీశారు. దీనిపై కొందరు డీసీసీ అధ్యక్షులు మీనాక్షితో తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. తమకు ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కొందరు డీసీసీ అధ్యక్షులు మీనాక్షికి ఫిర్యాదు చేశారు.
తమను మంత్రులు పట్టించుకోవడం లేదని మరి కొందరు డీసీసీ అధ్యక్షులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వారి అనుమతి లేకుండా తమను నియోజకవర్గాల్లో తిరగవద్దని ఎమ్మెల్యేలు, మంత్రులు అంటున్నారని కొందరు డీసీసీ అధ్యక్షులు మీనాక్షి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె స్పందిస్తూ ‘‘డీసీసీ అధ్యక్షునిగా పార్టీ పరంగా ఆ జిల్లాకు నువ్వే బాస్.. నిన్ను తిరగవద్దని ఆదేశించే అధికారం ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేదు, పార్టీ కోసం జిల్లా అంతటా పర్యటించు, కాంగ్రెస్ ను బలోపేతం చేయి, ఎక్కడైనా, ఎవరితోనైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురా” అని డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి స్పష్టం చేశారు. వన్ టూ వన్‌లో మీనాక్షితో పాటు డీసీసీ అధ్యక్షుల వ్యవహారాలను పర్యవేక్షించే తమిళనాడు ఎంపీ శశికాంత్ సింథాల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఉన్నారు.
ఆదివారం సర్‌పై సీఎం, మీనాక్షి, మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ సాగుతున్న తీరుపై పార్టీ నేతలతో సమీక్షించి, వారికి దీనిపై మరోసారి దిశా నిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఆదివారం జూమ్‌లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సర్ కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఇందులో పాల్గొననున్నారు.
