- ఇప్పటికే 2 శాతం పెరిగిన టీసీఎస్
- యుద్ధం వల్ల గ్యాస్, బార్లీ , హాప్స్ దిగుమతులకు తిప్పలు
- రేట్లు పెంచాలంటూ ఎక్సైజ్ శాఖకు
- కంపెనీల ప్రతిపాదనలు.. బీరుపై కనీసం రూ. 15- నుంచి రూ.20 పెంచాలని వినతి
- సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపు
- ఈసారి యుద్ధం కారణంగా మరింత ఒత్తిడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ ధరలు పెరిగే చాన్స్కనిపిస్తున్నది. రేట్లు పెంచాలని, ఆ మేరకు తమకు మార్జిన్లు ఇవ్వాలని తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ధరల సవరణ జరుగుతుంది. ఈ సారి అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు, పన్నుల భారంతో కచ్చితంగా రేట్లు పెంచాల్సిందేనని కంపెనీలు పట్టుపడ్తున్నాయి. అమెరికా, -ఇరాన్ వార్ వల్ల ముడిసరుకుల ధరలు పెరగడం, 2026–-27 బడ్జెట్‌లో మద్యంపై టీసీఎస్‌ను 1 శాతం నుంచి 2 శాతానికి పెంచిన అంశాన్ని ముందుకు తెస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల తమ లాభాల మార్జిన్లు దారుణంగా పడిపోతున్నాయని రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు సప్లయర్లు.. ఇటు రిటైలర్లు తమకు అనుకూలంగా ఉండేలా రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. బీరుపై రూ.15 నుంచి రూ.20 వరకు ధర పెంచాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 10 శాతం అదనపు వ్యాట్ తో ఇప్పటికే బ్రాండ్ల వారీగా మార్జిన్లు పడిపోయాయి. చీప్ లిక్కర్‌పై 11.6 శాతం మార్జిన్ ఉంటే, ఓసీ పై 4.3 శాతం, ఎంసీపై కేవలం 3.8 శాతం మాత్రమే మిగులుతోంది. కాగా, ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన టీసీఎస్(టాక్స్కలెక్షన్ ఎట్సోర్స్) 2 శాతానికి పెంచడంతో ఈ మార్జిన్లు మరింత తగ్గాయి. ఉదాహరణకు ఎంసీ మార్జిన్ 2.8 శాతానికి, ఓసీ 3.3 శాతానికి పడిపోయింది. ప్రతి బిల్లుపై తక్షణ నష్టం కలగడం, వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవ్వడం, టీసీఎస్ రీఫండ్ గ్యారంటీ లేకపోవడంతో రిటైలర్లు ఆందోళన చెందుతున్నారు.
యుద్ధం ఎపెక్ట్ తో రేట్ల పెంపు
ప్రస్తుతం నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్‌ను దెబ్బతీశాయి. మద్యం బాటిళ్లు తయారు చేసే గ్లాస్ ఇండస్ట్రీలో నేచురల్ గ్యాస్ వాడకం ఎక్కువ. ఇప్పటికైతే సమస్యలేకున్నా యుద్ధం కారణంగా త్వరలో ఇంధన ధరలు పెరగడంతో గాజు సీసాల తయారీ వ్యయం కూడా పెరిగే చాన్స్ ఉంది. దీనికి తోడు బీరు తయారీలో వాడే ‘బార్లీ’, ‘హాప్స్’ దిగుమతులకు అంతర్జాతీయంగా ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగాయి. సముద్ర మార్గాల్లో రవాణా చార్జీలు పెరగడం, బీమా ఖర్చులు భారమవడంతో కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గమని కంపెనీలు అంటున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ధరలను పెంచేటప్పుడు ‘ఎక్సైజ్ పాలసీ’ని ప్రాతిపదికగా తీసుకుంటాయి. మద్యం తయారీ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయం పెరిగిందని ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడు, ఎక్సైజ్ శాఖ ఒక కమిటీని వేసి ఆ విజ్ఞప్తులను పరిశీలిస్తుంది. రాష్ట్రంలో గతంలో మే, 2025లో చీప్ లిక్కర్, బీరు మినహా ఇతర లిక్కర్రేట్లను పెంచారు.
డిమాండ్‌ను క్యాష్ చేసుకునేలా..
ప్రస్తుతం తెలంగాణలో బీర్లకు పీక్ సీజన్ నడుస్తోంది. ఎండలు మండుతుండడం, ఐపీఎల్ క్రికెట్ సీజన్ మొదలవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. సాధారణ రోజుల్లో కంటే వేసవిలో బీర్ల డిమాండ్ రెట్టింపు ఉంటుంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని భర్తీ చేయడానికి కంపెనీలు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి. బీరు బాటిల్‌పై కనీసం రూ.15 నుంచి రూ.20 పెంచాలని కోరుతున్నాయి. కాగా, లిక్కర్ రేట్ల పెంపు అనేది ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు వినియోగదారుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ రేట్ల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతున్నది.
