- ఉత్తరాఖండ్ నుంచి మొక్కలు
- అటవీ శాఖ ఆధ్వర్యంలో భూముల కేటాయింపు
- గ్రామ పంచాయతీ, ఈజీఎస్ సిబ్బందికి పెంపకం బాధ్యతలు
- పొనికి కర్ర లేక అంతరించే దశలో ఉన్న కొయ్య బొమ్మల పరిశ్రమకు ఊపిరి
నిర్మల్, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ కొయ్య బొమ్మ పరిశ్రమ మనుగడకు ఉపాధి హామీ పథకం ఊపిరి పోయబోతోంది. కొయ్య బొమ్మల తయారీకి ప్రధాన ముడిసరుకైన పొనికి కలపకు తీవ్ర కొరత నెలకొన్న తరుణంలో జిల్లా అధికారులు ఈజీఎస్ కింద పొనికి వనాలు పెంచాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా అటవీ ప్రాంతంలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతరించిపోయే దశలో..
నిర్మల్ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పొనికి వనాలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఒక్క ప్రభుత్వ కలప డిపోలో కొంత మేర పొనికి కలప దుంగలు అందుబాటులో ఉన్నా యి. ఇవి కూడా కొన్ని రోజులకు మాత్రమే సరిపోయేలా ఉన్నట్లు కళాకారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పొనికి కలప అందుబాటులో లేకపోవడంతో చాలా మంది కళాకారులు ఆ రంగాన్ని వదులుకుంటున్నారు. విషయాన్ని గుర్తించిన నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ఈజీఎస్ స్కీమ్‌లో భాగంగా పొనికి వనాలను పెంచాలని నిర్ణయించారు. ఇందులో అటవీ శాఖకు కూడా భాగస్వామ్యం కల్పించారు.
సాయిల్ టెస్టింగ్ తో అటవీ స్థలాల గుర్తింపు..
అటవీశాఖ అధికారులు పలుమార్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పొనికి చెట్ల పెంపకానికి భూములను గుర్తించారు. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ సమీపంలో కొంత భూమిని అలాగే మామడ మండలం లింగాపూర్, జగదాంబ తండాతో పాటు మరి కొన్ని గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేశారు.
ఉత్తరాఖండ్ నుంచి 5వేల మొక్కలు..
జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడా పొనికి మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంఅధికారులతో సంప్రదింపులు జరిపిన 5 వేల పొనికి మొక్కలను మొదట ప్లాంటేషన్ కోసం తెప్పించారు. ముందుగా 3 వేల మొక్కలను అటవీ భూముల్లో పెంచుతున్నారు. మిగిలిన మొ క్కలను అనుకూలమైన చోట పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలా పొనికి వనాల పెంపు ఊపందుకోవడంతో కొయ్య బొమ్మల తయారీకి అవసరమయ్యే కలప కొరత తీరుతుందని భావిస్తున్నారు. దీంతో 200 ఫ్యామిలీలకు తిరిగి ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా కొయ్య బొమ్మల కళకు జీవం పోసినట్లవుతుందని అంటున్నారు.
ఉపాధి కూలీలకు బాధ్యత..
వనాల పెంపు బాధ్యతను ఉపాధి హామీ కూలీలకు అప్పగించారు. సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది సహకా రంతో ప్రతిరోజు పొనికి చెట్ల పెంపకం కోసం శ్రమిస్తున్నారు. అటవీశాఖ ద్వారా ఎప్పటికప్పుడు సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు. నీళ్లు అవసరమైన చోట ఉపాధి హామీ పథకం ద్వారా బోరు బావులు తవ్వించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెట్లు పెరిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, కలుపు తొలగింపుపై దృష్టి సారించారు.
ఉపాధి కూలీలు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవసరమైతే సేంద్రియ ఎరువులను కూడా వినియోగిస్తున్నారు. పొనికి చెట్టు పెరిగేందుకు పదేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 90 శాతం సక్సెస్ రేట్‌తో మొక్కలు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
