Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాజకీయ అస్థిరత, బోర్డులో అంతర్గత పోరు, ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఆ దేశ క్రికెట్ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఇటీవల జరిగిన 'CJKS టాలెంట్ కప్ 2026'లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఏడుగురు ఆటగాళ్లపై వేటు పడింది. ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఒక మ్యాచ్‌లో బకాలియా ఏకాదష్ జట్టుకు చెందిన ప్లేయర్లు కావాలనే అవుట్ అవ్వడం అధికారుల దృష్టికి వచ్చింది.
బీసీబీ డైరెక్టర్‌పై ఆరోపణలు:
కేవలం లోకల్ టోర్నమెంట్లే కాకుండా, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)కి కూడా ఫిక్సింగ్ సెగలు తగిలాయి. రాజ్‌షాహి డివిజన్ బీసీబీ డైరెక్టర్ ముఖ్లేసూర్ రెహమాన్ షమీమ్, స్పాటర్లతో హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఒక ఇన్వెస్టిగేషన్ వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది.
సంక్షోభంలో BCB బోర్డు:
గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అనేక సమస్యలతో సతమతమవుతోంది. బీసీబీ– బీసీసీఐ మధ్య ఏర్పడిన విభేదాలతో స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతర్గత రాజకీయాల వల్ల బంగ్లాదేశ్ జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి కూడా వైదొలిగింది. అలాగే స్పాన్సర్లు లేక మహిళా ప్రీమియర్ లీగ్ (WBPL) కూడా వాయిదా పడింది.
భారత్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నం:
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌పై ఇటీవల సాధించిన వన్డే సిరీస్ విజయం బంగ్లాదేశ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వచ్చే 12 నెలల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లపై వారు దృష్టి సారించారు. బీసీసీఐతో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి రాబోయే మహిళా లీగ్‌లో భారత మహిళా క్రికెటర్లను ఆహ్వానించాలని బీసీబీ యోచిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ మళ్లీ గాడిలో పడాలంటే ఫిక్సింగ్ లాంటి అంశాలపై కఠినంగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
నిషేధానికి గురైన ఆటగాళ్లు: సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఒమర్ ఫారూక్, టిన్ ధార్, మాహిర్ అన్వర్, మహమ్మద్ ఇక్బాల్, నాజ్ముల్ ఇస్లాం. ఈ వ్యవహారంలో ఆటగాళ్లతో పాటు కోచ్ అమీనుల్ హక్ కూడా ఈ కుంభకోణంలో భాగస్వామి కావడంతో, ఆయనపై ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి నిషేధం విధించారు.
