ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లినప్పుడు కాదు.. కష్టంలో ఎలా ఉన్నావ్.. ఎలా నిబడ్డావు అనేది ముఖ్యం. నిన్నటి వరకు ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హ్యాపీ లైఫ్.. రాత్రికి రాత్రి ఉద్యోగం పోయింది. నెలనెలా వచ్చే లక్షలు పోయాయి.. అలా అని ఏడుస్తూ కూర్చుంటే కూడు ఎవడు పెడతాడు.. పెళ్లాం బిడ్డలను ఎవరు పోషిస్తాడు అనుకున్నాడు.. ఉద్యోగం పోయిన క్షణం నుంచి వాట్ నెక్ట్స్ అని ఆలోచించాడు ఆ మాజీ ఒరాకిల్ ఐటీ ఉద్యోగి. బీ పాజిటివ్ అనుకున్నాడు.. గతం గతం అనుకున్నాడు.
ఇప్పటికిప్పుడు మరో ఐటీ ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు.. వెంటనే డబ్బులు సంపాదించే మార్గం ఏంటా అని ఆలోచించాడు.. అప్పటికిప్పుడు పని అంటే.. ఒక్కటే గుర్తుకొచ్చింది. తనకు వచ్చిన డ్రైవింగ్.. సొంత కారు ఉండనే ఉంది.. వెంటనే ఉబర్ కంపెనీని కాంటాక్ట్ అయ్యాడు. తన సొంత కారున ట్యాక్సీ కింద పెట్టాడు.. తానే డ్రైవర్ అవతారం ఎత్తాడు.. ఆ వెంటనే కాల్స్ వచ్చాయి.. రోడ్డెక్కాడు.. నాలుగు రాళ్లు సంపాదించటం మొదలుపెట్టేశాడు.. జీవితం విలువ తెలిసినోడు.. లోకం పోకడ గమనిస్తున్న వాడు.. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడు అనటానికి ఇదే నిదర్శనం.. పని చిన్నదా పెద్దదా అని కాదు.. పైసలు వస్తున్నాయా అది గౌరవంగా అనేది ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒరాకిల్ మాజీ ఐటీ ఉద్యోగి ట్యాక్సీ డ్రైవర్ కథ పూర్తిగా తెలుసుకుందామా..
సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం పోయిందంటే ఎవరైనా ఏం చేస్తారు? కంగారు పడిపోతారు. రాత్రంతా నిద్రలేకుండా లింక్డ్‌ఇన్ లో కొత్త జాబ్స్ కోసం వెతుకుతారు. అమ్మో ఒకటో తారీఖు వస్తే ఈఎంఐలు ఎలా కట్టాలి. ఇంట్లో పిల్లల ఫీజులు.. మెడికల్ ఖర్చులు, ఇంటి భారం, అద్దె అంటూ ఆలోచిస్తూ మైండ్ పోగొట్టుకుంటారు. కానీ బెంగళూరులోని ఒరాకిల్ కంపెనీలో పనిచేసే ఒక టెక్కీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ఇటీవల ఒరాకిల్ భారత్‌లో దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించింది. మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటలకే "మీ పాత్ర సంస్థకు అవసరం లేదు, ఇదే మీ చివరి పనిదినం" అని ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి కుప్పకూలిపోకుండా.. ఆ టెక్కీ తన సామాన్లన్నీ సర్దుకుని సైలెంట్‌గా సొంతూరు భువనేశ్వర్‌కు పయనమయ్యాడు. సోషల్ మీడియాలో ఏడవడం లేదంటే కంపెనీని తిట్టడం చేయకుండా అతను చూపించిన తెగువ వెనుక ఒక అద్భుతమైన ఓల్డ్ స్కూల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది.
One of my close friends was fired from Oracle Bangalore.
— Nayak Satya (@NayakSatya_SG) April 5, 2026
No panic, no stress, and no crying on social media.
He straight away came back to his hometown Bhubaneswar
He had postal fixed deposits in two joint accounts ₹15 lakh each. One with his parents, and the other in his…
సదరు టెక్కీకి ఎలాంటి ఈఎంఐలు, హోమ్ లోన్లు లేవని అతని స్నేహితుడు నాయక్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు. మెట్రో నగరాల్లో ఖరీదైన ఫ్లాట్లు కొని అప్పుల ఊబిలో కూరుకుపోకుండా.. క్రమశిక్షణతో పొదుపు చేశాడు సంపాదించిన డబ్బును. అతని దగ్గర పోస్టల్ ఆఫీస్‌లో రెండు జాయింట్ అకౌంట్లలో చెరో రూ.15 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయట. వీటి ద్వారా నెలకు రూ.28వేలు వడ్డీ వస్తోంది. ఇవి కాకుండా మరో రూ.30 లక్షల ఇతర ఎఫ్‌డీల ద్వారా నెలకు రూ.15వేలు అదనంగా పొందుతున్నాడు. అంటే ఉద్యోగం లేకపోయినా.. కేవలం వడ్డీల రూపంలోనే నెలకు రూ.43వేల వరకూ ఆదాయం నిలకడగా వస్తోంది. ఈ ఆర్థిక భరోసానే అతడిని ప్రశాంతంగా ఉంచుతోందని స్నేహితుడు నాయక్ పేర్కొన్నాడు.
మరి ఆ టెక్కీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు..?
ఒరాకిల్ లో జాబ్ పోవటంతో సొంతూరు తిరిగి వెళ్లిపోయిన సదరు టెక్కీ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ.. ఖాళీగా కూర్చోకుండా ఉబెర్ డ్రైవర్‌గా మారాడు. 14 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్నప్పటికీ.. పని ఏదైనా గౌరవంగా భావించి కారు నడుపుతూనే, మరోవైపు తన తల్లిదండ్రుల సాయంతో చిన్న వ్యాపారం ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. నేటి తరం టెక్కీల్లాగా కేవలం స్టాక్ మార్కెట్, ఎస్ఐపీలు లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి హడావుడి చేయకుండా.. పక్కాగా పాత పద్ధతుల్లో డబ్బును దాచుకోవడం అతనికి రక్షణ కవచంలా మారింది. కష్టకాలంలో మనకు అండగా నిలిచేది మన పొదుపు మాత్రమేనని ఈ టెక్కీ స్టోరీ మరో సారి నిరూపించింది. అందుకే ఉద్యోగం ఉన్నప్పుడే భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటే.. ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కంగారు పడకుండా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
