ఇక మేఘా పర్యాటకం!..ఇన్ ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ నుంచి టూరిజం రంగంలోకి ఎంట్రీ

ఇక మేఘా పర్యాటకం!..ఇన్ ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ నుంచి టూరిజం రంగంలోకి ఎంట్రీ
  • అనంతగిరిలో వెల్‌‌‌‌నెస్‌‌‌‌ రిట్రీట్ సెంటర్ ​ఏర్పాటుకు సర్కారుతో ‘మేఘా’ కంపెనీ ఒప్పందం
  • రాబోయే రోజుల్లో  1,021 కోట్ల భారీ పెట్టుబడులు 
  • వెల్‌‌‌‌నెస్‌‌‌‌​ డెస్టినేషన్‌‌‌‌గా  హైదరాబాద్‌‌‌‌ను తీర్చిదిద్దే లక్ష్యంలో తొలి అడుగు
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ విల్లాలు, నేచర్ థెరపీ సెంటర్లు
  • కేరళ ఆయుర్వేద మసాజ్‌‌‌‌లు, యోగా వేదికలు, ప్రపంచస్థాయి స్పా కేంద్రాలు
  • -మేఘా కంపెనీకి 81 ఎకరాల భూమిని 66 ఏండ్లపాటు లీజుకిస్తూ ప్రత్యేక జీవో
  • ప్రాజెక్టు ప్రోత్సాహానికి సర్కారు తరఫున రాయితీలు, పలు కండీషన్లు 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలాంటి ఇరిగేషన్​ ప్రాజెక్టులు, జోజిలా లాంటి టన్నెళ్లు, పవర్​ప్లాంట్లు, రిఫైనరీలు, వివిధ నేషనల్​హైవేల నిర్మాణం, ఎలక్ట్రిక్​ బస్సుల తయారీ.. ఇలా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న  ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్​)’ కంపెనీ.. ఇప్పుడు రాష్ట్ర  పర్యాటక రంగంలోకి ప్రవేశించింది. నిరుడు దావోస్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు  వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని 81 ఎకరాల విస్తీర్ణంలో  ‘లా వీ వెల్‌‌‌‌నెస్‌‌‌‌ రిట్రీట్’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న టూరిజం ప్రాజెక్టులో ఏకంగా  రూ.1,021 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఇందులో భాగంగా మేఘా సంస్థకు 63 ఏండ్ల పాటు లీజు(అవసరమైతే మరో 33 ఏండ్లపాటు పొడిగించుకునే చాన్స్​)కు  ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025–-30’లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం  కీలకమైన ‘ఐకానిక్ కేటగిరీ’ కింద గుర్తింపునిచ్చింది. ఇదే ఊపుతో రాష్ట్రంలోని మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్ (పీపీపీ) పద్ధతిలో వెల్​నెస్​సెంటర్లు, రిసార్టుల నిర్మాణానికి మేఘా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 

ఐకానిక్ హోదా.. రాయితీల వెల్లువ..

గ్రేటర్​ హైదరాబాద్‌‌‌‌ను ఆనుకొని ఉన్న వికారాబాద్​ జిల్లా అనంతగిరి అడవులు ఆహ్లాదానికి పెట్టింది పేరు.  గజిబిజి జీవితంలో అలసిసొలసే నగరజీవిని ఇక్కడి గుట్టలు, పచ్చని చెట్లు సేదదీరుస్తాయి. జింకలు, నెమళ్లు సహా వివిధ రకాల వన్యప్రాణులు, పక్షుల కిలకిలరావాలతో అలరారే అనంతగిరిలో అటవీశాఖ.. ఇప్పటికే ‘బ్రీజ్’​ పేరుతో స్పెషల్​ టూర్​ ప్యాకేజీలను అందిస్తున్నది. ఇందులో భాగంగా సఫారీ, ట్రెక్కింగ్​, బుష్ బ్రేక్​ఫాస్ట్​లు, బోటింగ్​, క్యాంపింగ్ నిర్వహిస్తుండగా, నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కానీ  దినదినాభివృద్ధి చెందుతున్న ఈ మెట్రోపాలిటన్​ సిటీ అవసరాలకు తగ్గట్టుగా ఇక్క డ ఏర్పాట్లు లేవు. దీనికి తోడు  ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025–---30’లో  భాగంగా హైదరాబాద్​ను ‘హెల్త్​టూరిజం హబ్’గా తీర్చిదిద్దుతామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా  అనంతగిరిలో  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వెల్‌‌‌‌నెస్‌‌‌‌​రిట్రీట్​ సెంటర్​ఏర్పాటుకు నిర్ణయించింది.  ఇందులో భాగంగా 2025 జనవరిలో దావోస్  వేదికగా జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌‌‌‌ సదస్సు’లో మేఘా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకున్నది. అందుకు తగ్గట్టుగానే అనంతగిరిలోని 81 ఎకరాల భూములను  మేఘా అనుబంధ సంస్థ ‘క్యామెలాట్ రిట్రీట్స్’కు 66 ఏండ్ల పాటు లీజుకిచ్చింది. అవసరమైతే మరో 33 ఏండ్లు.. అంటే  99 ఏండ్ల దాకా పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో జారీ చేసింది.  మొదటి దశలోనే రూ.571.40 కోట్ల తో వివిధ పనులు చేపట్టేందుకు మేఘా సంస్థకు అనుమతులు మంజూరుచేసింది. ఈ  ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 15 ఏండ్లపాటు 100 శాతం ఎస్​జీఎస్టీ రిటర్న్​, 10 ఏండ్ల పాటు టర్మ్ లోన్‌‌‌‌ వడ్డీపై 3 శాతం సబ్సిడీ, మరో 15 ఏండ్లపాటు విద్యుత్‌‌‌‌పై యూనిట్‌‌‌‌కు రూ. 3 రాయితీ కల్పించనున్నట్టు జీవోలో పేర్కొన్నది. వీటితోపాటు భూమి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ చార్జీలకు పూర్తి రీయింబర్స్‌‌‌‌మెంట్​ఇవ్వనున్నట్టు స్పష్టంచేసింది. అలాగే ప్రాజెక్టు కమర్షియల్ ఆపరేషన్స్ (సీవోడీ) ప్రారంభించిన ఏడాదిలోగా కేంద్ర పర్యాటక శాఖ నుంచి 5 స్టార్ డీలక్స్ రేటింగ్ పొందాలని, అంతర్జాతీయస్థాయిలో పేరున్న వెల్‌‌‌‌నెస్‌‌‌‌, స్పా ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకోవాలని, నిర్మాణ దశ, ఆపరేషన్స్ ప్రారంభించిన ఐదేండ్ల వరకు మేఘా సంస్థకు ఇందులో కనీసం 51 శాతం వాటా కలిగి ఉండాలంటూ పలు కండీషన్లను ప్రభుత్వం విధించింది.

స్థానిక యువతకు ఉపాధి

యూరప్, అమెరికాతోపాటు ఇతర విదేశీ పర్యాటకులకు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సుమారు 2 వేల మంది స్థానిక యువతకు హోటల్ మేనేజ్‌‌‌‌మెంట్, థెరపీ, గార్డెనింగ్‌‌‌‌లాంటి రంగాల్లో ఉపాధి​కల్పించాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి లీజులు, పన్నుల రూపంలో  66 ఏండ్లలో రూ.1,204 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు పూర్తయితే  సర్కారు ‘హెల్త్​ టూరిజం’ లక్ష్యం నెరవేరడంతోపాటు మరో రంగంలోనూ ‘మేఘా’ ప్రతిష్ట ఇనుమడిస్తుందని  భావిస్తున్నారు.

విహారయాత్ర మొదలు ప్రకృతి చికిత్స దాకా..

ఒప్పందంలో భాగంగా అనంతగిరిలో మేఘా  సంస్థ ‘లా వీ వెల్‌‌‌‌నెస్‌‌‌‌​ రిట్రీట్’ పేరుతో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు​నిర్మించబోతున్నది. ఇది కేవలం విహారయాత్ర కోసమే కాకుండా పర్యాటకుల శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించేలా ప్రత్యేక చికిత్సా కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నది.  ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ విల్లాలు, సూట్ రూములు, నేచర్ థెరపీ సెంటర్లు (ప్రకృతి చికిత్స) ఏర్పాటుచేస్తారు. మడ్ థెరపీ(మట్టి స్నానం),  హైడ్రోథెరపీ(జల చికిత్స)లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. కొండల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా యోగా చేసుకునేందుకు ప్రత్యేక వేదికలు, ప్రపంచస్థాయి స్పా కేంద్రాలు ఏర్పాటుచేస్తారు.  కేరళ ఆయుర్వేద మసాజ్‌‌‌‌లు, అంతర్జాతీయ స్పా ట్రీట్‌‌‌‌మెంట్లు అందుబాటులోకి తెస్తారు. పర్యాటకులు సేద తీరడానికి, పిల్లల కోసం ప్రత్యేక వినోద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అతిథులకు స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు, ఇతర సేంద్రియ ఆహారపదార్థాలను వడ్డిస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా వైన్ మార్ట్‌‌‌‌లు, మల్టీ రెస్టారెంట్లు, ఫైవ్​స్టార్​ హోటళ్లు ఏర్పాటుచేస్తారు. దేశంలోనే అతిపెద్ద వెల్‌‌‌‌నెస్‌‌‌‌ డెస్టినేషన్లలో ఒకటిగా దీనిని అభివృద్ధి చేసేందుకు ప్లాన్​రెడీ చేశారు.