బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. రూ.14 లక్షల డబ్బును అప్పుగా తీసుకుని ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు గవర్నమెంట్ స్కూల్ టీచర్ను చంపి తగలబెట్టేసిన ఘటన కలబురగి జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని కమలాపూర్ తాలూకాలోని కల్ముడ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన సగం కాలిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు.
హత్యకు గురైన మహిళను పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న జ్యోతి కపాలే హిరేమత్ అనే మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె వయసు 57 సంవత్సరాలు. ఆమె ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినందుకు.. ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఆమెను హత్య చేశాడు. ఆమెను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో కాల్చేశాడు. ఈ హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జ్యోతి కపాలే హిరేమత్ బీదర్ జిల్లాలోని భాల్కి తాలూకా, వందర్‌ఖేడా అనే గ్రామంలో టీచర్గా పనిచేస్తుంది. ఆమె బీదర్‌లో ఉంటూ రోజూ స్కూల్కు వెళ్లేది. అయితే ఆమె కుటుంబం కలబురగిలో ఉండటంతో వారానికి ఒకసారి కలబురగికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే.. ఆమె కలబురగికి వెళ్లి తిరిగి బీదర్‌కు వెళ్తుండగా నిందితుడు పక్కాగా ప్లాన్ చేసి ఆమెను హత్య చేశాడు. జ్యోతికి పరిచయస్తుడైన నిందితుడు.. ఆమె దగ్గర రూ.14 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి ఇచ్చే ఉద్దేశం లేని నిందితుడు.. జ్యోతి నిలదీసి అడిగేసరికి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ కారణంగా జ్యోతిపై నిందితుడు పగ పెంచుకున్నాడు.
ఆమెను హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ఆమె మృతదేహాన్ని కాల్చి బూడిద చేశాడు. కమలాపూర్ తాలూకాలోని కల్ముడ గ్రామంలో జ్యోతి మృతదేహం కాలిపోయిన స్థితిలో గ్రామస్తుల కంట పడింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జ్యోతి మృతదేహం మొత్తం కాలిపోయిన స్థితిలో ఉండి కేవలం కాళ్లు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో స్థానిక ఎస్పీ, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఈ ఘటనపై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. పోలీసులు నిందితుడు ఆనంద్‌ను అరెస్టు చేశారు.
