హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మల్టీ జోన్-–1 పరిధిలోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1, సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలకు చెందిన ఆరుగురు ఉద్యోగులకు మండల పంచాయతీ అధికారులుగా (ఎంపీవోలు) ప్రమోషన్ కల్పిస్తూ పీఆర్, ఆర్డీ కమిషనర్ డి.దివ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం 2019–-20, 2020–-21 ప్యానెల్ సంవత్సరాలకు సంబంధించి నిర్వహించిన రివ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టారు. గతంలో జరిగిన ఎంపీవో ప్రమోషన్లపై ఏర్పడిన సందేహాలు, కొత్త లోకల్ క్యాడర్ అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం అంతర్గత కమిటీని నియమించింది. ఈ కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ), నిబంధనల ప్రకారం అర్హులైనవారికి ప్రమోషన్లు ఖరారు చేసింది.
నిజామాబాద్జిల్లాలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా కొనసాగుతున్న ఏ.గంగాధర్, రజినీకాంత్ రెడ్డి, సయ్యద్మగ్దమ్ అహ్మద్‌ను మెదక్ జిల్లాకు ఎంపీవోలుగా కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పి.సాయిలును సిద్ధిపేట, సిద్ధిపేటలో గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న మునీరుద్దీన్ను మెదక్, వరంగల్జిల్లాలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షాజహాన్ ను ములుగుకు కేటాయించారు. ప్రమోషన్ పొందినవారు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త జిల్లాలో విధుల్లో చేరాలని పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది.
ఈ నియామకాలను అడ్‌హక్ ప్రాతిపదికన చేపట్టారు. కోర్టు కేసులు లేదా ఇతర పాలనాపరమైన నిర్ణయాలకు లోబడి ఈ ప్రమోషన్లు ఉంటాయని పేర్కొంది. ప్రమోషన్ పొందిన వారిని వెంటనే విధుల్లో నుంచి రిలీవ్ చేయాలని, వారు రిపోర్ట్ చేసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.
