ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు

ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు
  • రేపు రాష్ట్ర కేబినెట్ మీటింగ్​
  • బడ్జెట్ సమావేశాలు, ఆరు గ్యారంటీలు, 
  • ఉద్యోగాల భర్తీపైనా చర్చించే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆరు గ్యారంటీల అమలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కేంద్రం ఈ నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. దీంతో దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్​పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్​లో చర్చించనున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్​లో రాష్ట్రానికి ఏమేమి వస్తాయనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో రాష్ట్రంలోనూ మధ్యంతర బడ్జెట్​ను పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మధ్యంతర బడ్జెట్ పెడితే వారం, 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే  ప్రభుత్వం ఇరిగేషన్​పై శ్వేతపత్రం రిలీజ్​ చేయనుంది. దీనిపై కూడా కేబినెట్​లో చర్చించనున్నారు.

ఇక ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారంటీలు అమల్లోకి వచ్చాయి. మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.500కే గ్యాస్​ సిలిండర్​ తో పాటు 200ల యూనిట్లలోపు కరెంట్ వినియోగం ఉచితంగా అందించేవి అందులో ఉన్నాయి. ఈ రెండింటిపైనా కేబినేట్​లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినేట్​లో చర్చించనున్నట్లు తెలిసింది. గ్రూప్ 1 పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వివిధ డిపార్ట్​మెంట్లలో ఖాళీలు ఏమున్నాయో మళ్లీ తాజాగా వివరాలు తెప్పించుకున్నది. దాని ప్రకారం 43 కొత్త గ్రూప్1 వెకెన్సీ పోస్టులను అధికారులు గుర్తించారు. మరికొన్నింటిని పెంచాలని కూడా రాష్ట్ర సర్కార్​ భావిస్తున్నది. దీంతో రానున్న ఆరు నెలల కాలంలో ఎంతమంది రిటైర్ అవుతారో వారి వివరాలు కూడా తీసుకుని గ్రూప్ 1 రిక్రూట్​మెంట్ చేపట్టనుంది. మరో 23 పోస్టులకు సంబంధించి కొంత డైలమా ఉన్నది. వీటితో పాటు ఇతర గ్రూప్స్ పరీక్షలు, ఫలితాల వెల్లడి, కోర్టుల్లో ఉన్న కేసులు, జాబ్ క్యాలెండర్ ఇతరత్రా వంటి వాటిపై కేబినేట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.