బీచ్‌లోకి జనం, టూరిస్టుల పరుగులు
అక్కడే తలదాచుకున్న 4 వేల మంది
రంగంలోకి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్
బూడిద, పొగతో జనం ఉక్కిరిబిక్కిరి
ఆస్ట్రేలియా బుష్ఫైర్స్కు తోడుగా గాలులు
పాత సంవత్సరానికి మంటలతో ఆస్ట్రేలియా గుడ్‌బై చెబుతోంది. కొత్త సంవత్సరంలోకి అదే మంటలతో అడుగుపెడుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు పెను గాలుల ధాటికి బుష్‌ఫైర్స్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతున్నాయి. సిడ్నీ, న్యూసౌత్వేల్స్కే పరిమితమైన మంటలు మంగళవారం మెల్బోర్న్, విక్టోరియా రాష్ట్రాలకూ పాకాయి. విక్టోరియాలోని మలాకూట, న్యూసౌత్‌వేల్స్‌లోని బాటెమన్స్ బేలో బుష్‌ఫైర్స్ ధాటికి టూరిస్టులు, స్థానికులు బీచ్‌లోకి పరుగులు తీశారు. చుట్టుముట్టిన మంటలతో బయటకు వచ్చే దారి లేక 4 వేల మందికిపైగా బీచ్‌లోనే ఉండిపోయారు. వందలాది ఇళ్లు కాలి బుగ్గయ్యాయి. ఉదయం 8 గంటలకు చిన్నచిన్నగా మొదలైన మంటలు కాసేపటికే పెను గాలులు తోడవడంతో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. దీంతో ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది.
బాటెమన్స్ బేలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తండ్రీకొడుకులుగా అధికారులు గుర్తించారు. దీంతో న్యూసౌత్‌వేల్స్‌లో మంటలకు చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. విక్టోరియాలో నలుగురు, న్యూసౌత్‌వేల్స్‌లో మరొకరు మిస్సయినట్టు అధికారులు తెలిపారు.మంటల వల్ల బూడిద ఆయా ప్రాంతాలను కప్పేసింది. ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. వాతావరణాన్ని పొగ కమ్మేసింది. దీంతో జనం ఆ పొగ నుంచి కాపాడుకునేందుకు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మరికొందరు ఇళ్లు వదిలి భద్రమైన చోటుకు తరలిపోతున్నారు. ఇంకొందరు బంకర్లలో చేరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. సూపర్మార్కెట్లలో జనం క్యూ కడుతున్నారు. సరుకులను తీసుకొచ్చుకుంటున్నారు. మంటలతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా రక్షణ దళాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయి. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగంలోకి దిగాయి. అమెరికా, కెనడా, న్యూజీలాండ్లూ ఫైర్‌ఫైటర్స్‌ను పంపాయి.
విక్టోరియాలోని ఈస్ట్ జిప్స్ల్యాండ్లో 2 లక్షల హెక్టార్ల మేర అడవులు బుగ్గయ్యాయి.
ఇప్పటిదాకా ఏడు ఎమర్జెన్సీ వార్నింగ్ అలర్ట్‌లు ఇచ్చారు.
విక్టోరియాలో చాలా ఇళ్లు తగలబడిపోయాయి. అయితే, ఇప్పుడప్పుడే ఎన్ని ఇళ్లు తగలబడ్డాయన్నది, ఎంత ఆస్తి నష్టం జరిగిందన్నది చెప్పలేమని అధికారులు అంటున్నారు.
మంటలకు తోడు కరెంట్ కోతలూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. నెట్ సర్వీసులూ ఆగిపోయాయి.
టాంబో క్రాసింగ్, మలాకూట, కాన్ రివర్. టోంగి క్రీక్, మౌంట్ రేమండ్, మార్లో, ఆర్బోస్ట్, వేగరా, మౌంట్ నోవా నోవాల్లో మొబైల్ సర్వీసులు బంద్ అయ్యాయి.
మంటలు కొంచెం తగ్గినా, గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మళ్లీ మంటలు పెరిగే ముప్పుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని డేనియల్ ఆండ్రూస్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
