బాలీవుడ్ హీరోయిన్, సింగర్ సబా ఆజాద్ (Saba Azad) ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలైంది. సైక్లోస్పోరా కయెటానెన్సిస్ అనే పరాన్నజీవి సోకినట్లుగా నిర్ధారణ కావడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం మార్చి 27న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తూ, ఆసుపత్రి బెడ్పై బలహీనంగా ఉన్న ఫోటోను పంచుకున్నారు.
ప్రస్తుతం సబా పోస్ట్ చేసిన ఫోటో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయింది. స్టార్ హీరో హృతిక్ రోషన్తో రిలేషన్‌లో ఉన్న ఆమె, గత రెండు వారాలను తన జీవితంలోనే “అత్యంత దారుణమైన 14 రోజులు గడిపినట్లుగా” సభా తన పరిస్థితి వివరించింది.
సైక్లోస్పోరియాసిస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సబా
సబా ఆజాద్‌కు సైక్లోస్పోరా కయెటానెన్సిస్ (Cyclospora cayetanensis) అనే ప్రమాదకర పరాన్నజీవి సోకింది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధిని సైక్లోస్పోరియాసిస్ (Cyclosporiasis) అంటారు. ఈ వ్యాధి కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
14 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన నటి
సబా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గత రెండు వారాలు తన జీవితంలోనే అత్యంత కష్టమైన సమయంగా పేర్కొన్నారు. కేవలం 14 రోజుల్లోనే సుమారు 4 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తీవ్రమైన బలహీనతతో నడవడమే కష్టంగా మారిందని, రోజుకు రెండు సార్లు వర్కౌట్ చేసే స్థితి నుంచి పూర్తిగా శక్తి కోల్పోయిన స్థితికి చేరుకున్నట్లుగా సభా తెలిపారు.
అయితే, ఇంటి ఆహారం మాత్రమే తీసుకుంటానని, ఎక్కడికి వెళ్తే అక్కడికి తన నీటిని వెంట తీసుకెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఇన్ఫెక్షన్ రావడం ఆశ్చర్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. చివరగా.. కనీసం ఒక చిన్న టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేదని.. ఇదంతా ఈ సైక్లోస్పోరా కయెటానెన్సిస్ అనే ఒక చెత్త బ్యాక్టీరియా వల్లనే అని మండిపడింది.
హృతిక్ రోషన్ మానసిక బలం
ఈ క్లిష్ట సమయంలోనూ తన బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ ధైర్యం ఇచ్చినట్లు సబా వెల్లడించారు. తన మనోధైర్యాన్ని పెంచుతూ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండేలా సహాయపడ్డారని, కష్టసమయంలో కూడా హాస్యాన్ని క్రియేట్ చేసి నవ్వించినట్లుగా సభా తెలిపింది.
ప్రజలకు హెచ్చరిక..
ఈ సందర్భంగా నెటిజన్లకు ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది. కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడగడం అత్యంత అవసరం. ఎందుకంటే ఒక్కోసారి నిజంగానే మన ప్రాణాలు వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ప్రత్యేకంగా బేకింగ్ సోడా వెజిటేబుల్ వాష్ వంటివి ఉపయోగించడం మంచిదని సూచించింది.
పరిశుభ్రతలో చిన్నపాటి నిర్లక్ష్యం ఆరోగ్యానికి ప్రమాదకరమని సభా హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. సబా ఆజాద్ ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం. ఆమె అనుభవం ప్రజలకు ఆహార పరిశుభ్రతపై మరింత అవగాహన కలిగించేలా ఉంది.
Cyclospora గురించి:
సైక్లోస్పోరా కయెటానెన్సిస్ అనే సూక్ష్మ పరాన్నజీవి ప్రధానంగా: కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా ఆకలి లేకపోవడం, విరేచనాలు, బలహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.
