మియాపూర్ పరిధిలో నాలుక కోసుకొని.. ఫ్యాన్ కు ఉరేసుకొని సీఏ స్టూడెంట్ సూసైడ్

మియాపూర్ పరిధిలో నాలుక కోసుకొని.. ఫ్యాన్ కు ఉరేసుకొని సీఏ స్టూడెంట్ సూసైడ్
  •     పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక దారుణం
  •     మృతుడు కర్నూలు జిల్లా వాసి

మియాపూర్, వెలుగు: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువకుడు అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట నాలుక కోసుకొని, ఆ తర్వాత ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని కర్నూలు జిల్లా ఉప్పలపాడుకు చెందిన ఆంజనేయులు కొడుకు జనార్దన్(28) సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గతంలో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో, మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గత ఫిబ్రవరిలో హైదరాబాద్​కు వచ్చి మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్ కాలనీలో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. 

ఇటీవల జరిగిన రెండు సబ్జెక్టుల పరీక్షలను అతను రాయలేదు. గురువారం ఉదయం స్నేహితులు ఉద్యోగాలకు వెళ్లగా.. గదిలో జనార్దన్ ఒక్కడే ఉన్నాడు. మొదట తన నాలుకను కట్ చేసుకొని, ఆపై లుంగీతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. సాయంత్రం 7 గంటలకు స్నేహితులు వచ్చి తలుపు కొట్టగా తీయకపోవడంతో.. అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. జనార్దన్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. 

వారు వచ్చి, జనార్దన్​మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గదిలో రెండు సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక దానిలో సీఏ కోర్సు చదవడం తన వల్ల కావడం లేదని, మరో లేఖలో  అమ్మానాన్నలు నన్ను క్షమించాలి అని రాసి ఉంది. అయితే, గది మొత్తం రక్తం ఉండటంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిది ఆత్మహత్య కాదని, దీని వెనక ఏదో కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. జనార్దన్​ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ పేర్కొన్నారు.