ఆధారాలు లేకుండా భర్తను తాగుబోతనడం క్రూరత్వమే

ఆధారాలు లేకుండా భర్తను తాగుబోతనడం క్రూరత్వమే

ముంబై : ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను ఉమనైజర్, తాగుబోతు అని పిలిచి పరువు తీయడం క్రూరత్వమేనని బాంబే హైకోర్టు వెల్లడించింది. తన భార్యతో విడాకులు మంజూరు చేయాలని పూణేకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గతంలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అన్ని ఆధారాలు పరిశీలించాకా దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భార్య(50 ఏళ్ల మహిళ) 2005 నవంబర్-లో హైకోర్టులో అప్పీల్‌‌ చేశారు. అప్పీల్ హైకోర్టులో విచారణలో ఉండగానే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చనిపోయారు. దాంతో అతని చట్టపరమైన వారసుడిని ఈ కేసులో కోర్టు ప్రతివాదిగా చేర్చింది. మహిళ చేసిన అప్పీల్‌‌ను జస్టిస్ నితిన్ జామ్‌‌దార్, జస్టిస్ షర్మిలా దేశ్‌‌ముఖ్‌‌ల బెంచ్ అక్టోబర్ 12న విచారించింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉమనైజరని, తాగుడుకు అలవాటు పడ్డాడని మహిళ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. భర్త దురలవాట్ల వల్ల మహిళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని..ఆమెకు వివాహ హక్కులు లేకుండా పోయాయని విన్నవించారు.

మహిళ తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసి.. అతనికి సమాజంలో గౌరవం లేకుండా చేసిందని మృతుడి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని విన్నవించారు. పిల్లలు, మనవరాళ్లు నుంచి కూడా భార్య వేరు చేసిందని ఫ్యామిలీ కోర్టులో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దాఖలు చేసిన వాదనను కూడా కోర్టు ప్రస్తావించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఇతరులకు మానసిక వేదనను కలిగించడం క్రూరత్వమని తెలిపింది. మానసిక వేదనకు గురిచేసేవారు మరొకరితో కలిసి జీవించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భర్త చెడ్డవాడని రుజువు చేసేందుకు ఆమె ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి మాజీ ఆర్మీ మేజర్‌‌గా పదవీ విరమణ చేశాడని..అతనికి సమాజంలోని ఉన్నతమైన గౌరవం, గుర్తింపు ఉన్నాయని వివరించింది. అలాంటి వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా తాగుబోతు, ఉమనైజర్ అని ముద్ర వేయడం దారుణమని చెప్పింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రతిష్టను అతని భార్యే కావాలని దెబ్బతీసిందని.. ఇది క్రూరత్వానికి సమానమని కోర్టు అభిప్రాయ పడింది. ఇది విడాకుల మంజూరుకు తగిన కేసు అని పేర్కొంది. గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.