ఇంటి నుంచే ప్రజాపాలన చేస్తున్న కెనడా ప్రధాని

ఇంటి నుంచే ప్రజాపాలన చేస్తున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో టెలీగవర్నెన్స్ ద్వారా పాలన సాగిస్తున్నారు. టెలీ గవర్నెన్స్​ అంటే ఇంటి నుంచే టెలిఫోన్​ ద్వారా పాలన కొనసాగించడం. ట్రూడో భార్య సోఫీ జార్జ్​ కు కొవిడ్​–19 పాజిటివ్​ గా తేలడంతో ఫ్యామిలీ మొత్తం సెల్ఫ్ క్వారెంటైన్​ పాటిస్తోంది. 14 రోజులపాటు పూర్తిగా ఇంటికే పరిమితం కానుంది. ఇంట్లోనే ఉంటున్నా.. ట్రూడో బిజీ షెడ్యూల్​తో గడుపుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్, ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ ఇమాన్యూయెల్​ మాక్రాన్, ఇటలీ ప్రధాని గుసెప్​ కాంటేతో పాటు పలువురు కెనడా లీడర్లతోనూ ఎప్పుడూ టచ్​లో ఉంటున్నారు. ట్రూడో ముగ్గురు పిల్లలు తమతమ గదుల్లో ఉంటూ లెగో గేమ్స్​ ఆడుకుంటున్నారు. ఆయన భార్య సోఫీ ఎక్కువ టైమ్​ ఫోన్​తోనే గడుపుతోంది.

వర్క్​ ఫ్రం హోం చేస్తున్నా

బుధవారం లండన్​ నుంచి వచ్చిన సోఫికి  కొద్దిగా  జ్వరం రావడంతో టెస్టులు చేయగా కొవిడ్–19 పాజిటివ్​గా తేలింది. దీంతో 14 రోజులు సెల్ఫ్​ క్వారెంటైన్​లో ఉండాలని ట్రూడో ఫ్యామిలీ నిర్ణయించుకుంది. తమ ఫ్యామిలీ సెల్ఫ్​ క్వారెంటైన్​లో ఎలా గడుపుతుందో ట్రూడో శుక్రవారం మీడియాతో పంచుకున్నారు. జర్నలిస్టులకు కొద్ది మీటర్ల దూరంలో నిలబడి తన ఫ్యామిలీ పరిస్థితులను గురించి ఆయన వివరించారు. ‘‘నేను ఒక విషయం క్లియర్​గా చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. నేను చాలా బాగున్నాను. ఇంటి నుంచి పనిచేయడానికి టెక్నాలజీ నాకు అవకాశం కల్పిస్తోంది”అని చెప్పారు. తన కేబినెట్​ మెంబర్లు, ఇతర కీలక అధికారులతో ఎప్పుడూ మాట్లాడుతున్నానని, కొవిడ్​ మరింత విస్తరించకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.