యూనిఫామ్ పోస్టుల్లో ఎత్తు 165 సెం.మీ పెట్టాలి

యూనిఫామ్ పోస్టుల్లో ఎత్తు 165 సెం.మీ పెట్టాలి

హైదరాబాద్, వెలుగు:పోలీస్ శాఖలో ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని సర్కారు పెంచడంతో.. గ్రూప్1 యూనిఫామ్ పోస్టులకు ఎత్తును కూడా సడలించాలని అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్పీ (సివిల్)తో పాటు డీఎస్పీ (జైల్స్​), అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేడర్ పోస్టులకు హైట్ నిబంధనను సవరించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. సివిల్స్, మెజార్టీ రాష్ర్టాల్లో అమలవుతున్న అభ్యర్థుల ఎత్తును పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

2 సెంటీమీటర్లు తగ్గించాలని..

రాష్ట్రంలో గ్రూప్1లో మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్‌‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంట్లో డీఎస్పీ (సివిల్) పోస్టులు 91, డీఎస్పీ (జైల్స్) 2, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు 26 ఉన్నాయి. ఈ మూడు యూనిఫామ్ పోస్టులకు పురుషులకు 167.6, మహిళలకు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న వారే అర్హులని ప్రకటించారు. అయితే ఎత్తును పురుషులకు 165కి తగ్గించాలని, మహిళలకు 150కి తగ్గించాలని కొంతకాలంగా అభ్యర్థులు సర్కారు పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. గతంలోనే హోంమంత్రి, డీజీపీని కలిసి హైట్ తగ్గించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించారని, సర్కారుకు డీజీపీ ప్రపోజల్ పంపినట్టు అభ్యర్థులు చెప్పారు. అయితే అప్పటికే గ్రూప్1 నోటిఫికేషన్ రావడంతో దానిపై చర్చ నిలిచిపోయింది. తాజాగా పోలీస్ శాఖలోని పోస్టులకు రెండేండ్ల ఏజ్ లిమిట్ పెంచడంతో అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. గ్రూప్​1 దరఖాస్తు గడువు ఉందని, సర్కారు పునరాలోచించాలని కోరుతున్నారు. మరోపక్క గ్రూప్1 అప్లికేషన్ల ప్రక్రియలోనూ హైట్ గురించిన ప్రస్తావనే లేదు.

చాలా రాష్ట్రాల్లో 165 సెంటీమీటర్లే

దేశంలోని దాదాపు 20 రాష్ర్టాల్లో గ్రూప్1 డీఎస్పీ కేడర్ పోస్టులకు ఎత్తు 165 సెంటీమీటర్లే ఉంది. కర్నాటక, తమిళనాడు, కేరళ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూకాశ్మీర్‌‌‌‌తో పాటు ఈశాన్య రాష్ర్టాలన్నీ ఇదే హైట్​నిబంధనను కొనసాగిస్తున్నాయి. రెండు సెంటీమీటర్ల ఎత్తు తగ్గించడం ద్వారా సర్కారుపై ఎలాంటి భారం పడబోదని, అయినా సర్కారు ఎందుకు బెట్టుగా ఉందో అర్థంకావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్.. ఫీల్డ్ పోస్టు అనీ, డీఎస్పీ.. ఆఫీసర్ పోస్టు అని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి, గ్రూప్1 యూనిఫామ్ కేడర్ పోస్టులకు హైట్ తగ్గించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

లక్షన్నర దాటిన అప్లికేషన్లు

గ్రూప్ 1 అప్లికేషన్లు లక్షన్నర దాటాయి. శుక్రవారం నాటికి 1,66,679  దరఖాస్తులు అందాయి. కొత్తగా1,28,578 మంది టీఎస్​పీఎస్సీ ఓటీఆర్​ను క్రియేట్ చేసుకోగా.. 2,68,928 మంది అప్​డేట్ చేసున్నారు. ఈ నెల 31 వరకు గ్రూప్​1కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది.

దరఖాస్తుల గడువు పొడిగించాలె: ఎన్‌‌ఎస్‌‌యూఐ

గ్రూప్ 1 దరఖాస్తుల గడువును పొడిగించాలని, డిగ్రీ ఫైనల్‌‌ ఇయర్‌‌ స్టూడెంట్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌‌ చేస్తూ శుక్రవారం ఎన్‌‌ఎస్‌‌యూఐ నాయకులు, కార్యకర్తలు టీఎస్‌‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత టీఎస్‌‌పీఎస్సీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌‌ఎస్‌‌యూఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్‌‌వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.