రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో టైర్ పేలి గాల్లోకి ఎగిరిన కారు

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో టైర్ పేలి గాల్లోకి ఎగిరిన కారు

చేవెళ్ల, వెలుగు: ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. టైర్ పేలి నియంత్రణ కోల్పోయిన ఓ కారు డివైడర్‎ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడడంతో.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం లక్ష్మీగూడకు చెందిన దివాకర్ రెడ్డి (25) షార్ట్ ఫిలిమ్స్​లో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన వ్యక్తిగత పనుల నిమిత్తం స్విఫ్ట్ కారులో చేవెళ్లకు వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరారు. 

పామెన గ్రామ సమీపంలోని మామూ దాబా వద్దకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న బ్రీజా కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో నియంత్రణ కోల్పోయిన ఆ కారు డివైడర్‎ను ఢీకొట్టి, గాల్లోకి ఎగిరి అవతలి వైపు ప్రయాణిస్తున్న దివాకర్ రెడ్డి కారుపై పడింది. ఈ ప్రమాదంలో దివాకర్ రెడ్డి కారు నుజ్జునుజ్జు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బ్రీజా కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దివాకర్ రెడ్డికి భార్య, కుమారుడు ఉండగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.