- ఇతర రాష్ట్రాలకు ఇక్కడి మొక్కలు
- మామిడి, జామ, కొబ్బరి, ఆయిల్‌పాం నర్సరీలు
- ఇక్కడి మామిడి మొక్కలకు ఫుల్ డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఉన్న నర్సరీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో పెంచుతున్న మొక్కలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. నర్సరీలకు ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కడియంకు కూడా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పెంచిన మామిడి మొక్కలు వెళ్లడం వీటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఆయిల్‌పాం, మామిడి, జామ, కొబ్బరి నర్సరీల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.
ఈ రంగంలో సంవత్సరానికి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల నాణ్యమైన మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతాలు నర్సరీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో దాదాపు 150 నర్సరీల్లో నాణ్యమైన అంటు మామిడి మొక్కలను పెంచుతున్నారు. హిమాయత్, బంగినపల్లి, పునాస, దశేరి, కేసరి, పెద్దరసం, చిన్నరసం, జలాలు, చెరుకురసం, కొత్తపల్లి కొబ్బరి, తోతాపురి, తెల్లగులాబీ, మంజీర వంటి పలు రకాల మామిడి మొక్కలు ఇక్కడ సాగు చేస్తున్నారు.
ఒక్క సీజన్‌లో సుమారు ఐదు లక్షల మామిడి మొక్కలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో 20కు పైగా జామ నర్సరీలు ఉన్నాయి. ప్రతి ఏడాది దాదాపు 20 లక్షల జామ మొక్కలు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి. థాయ్, అలహాబాద్ సఫేదా, రెడ్, పింక్, లక్నో–49, అర్క కిరణ్ వంటి పలు రకాల క్లోనింగ్ జామ మొక్కలకు ఈ నర్సరీలు ప్రసిద్ధి చెందాయి.
ఆయిల్‌పాం, కొబ్బరి మొక్కలు
రాష్ట్రంలో అత్యధికంగా ఆయిల్‌పాం మొక్కల పెంపకం అశ్వారావుపేట నియోజకవర్గంలోనే జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు సిద్దిపేట, సంగారెడ్డి, జనగామ జిల్లాల్లో కూడా నర్సరీలు ఉన్నప్పటికీ, అత్యధికంగా మొక్కల ఉత్పత్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే జరుగుతోంది. అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ప్రధానంగా ఆయిల్‌పాం నర్సరీలు ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు ఎనిమిది లక్షల మొక్కలు ఇక్కడ పెంచి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కొబ్బరి మొక్కల పెంపకం కూడా విస్తృతంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల కొబ్బరి మొక్కలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని నర్సరీల ద్వారా సుమారు 7 వేల నుంచి 10 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో సంవత్సరానికి రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోంది.
వేలాది మందికి ఉపాధి
పలు రకాల మామిడి, జామ, ఆయిల్‌పాం, కొబ్బరి మొక్కల నర్సరీలకు అశ్వారావుపేట నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నాణ్యమైన అంటు, క్లోనింగ్ మొక్కల పెరుగుతున్నాయి. నర్సరీల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.- జె. కిషోర్, జిల్లా హార్టికల్చర్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం
వాతావరణం అనుకూలం
అశ్వారావుపేట ప్రాంతంలోని వాతావరణం, నేలలు నర్సరీలకు అనుకూలంగా ఉన్నాయి. మామిడి, జామ, ఆయిల్‌పాం, కొబ్బరి మొక్కల పెంపకానికి ఇది సరైన వాతావరణం కావడంతో నర్సరీలకు మంచి డిమాండ్ ఉంది. -రవికుమార్, ఏడీఏ, వ్యవసాయ శాఖ, అశ్వారావుపేట
