మాస్కో: అంచనాలే లేకుండా బరిలోకి దిగి ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఇండియా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి బ్లిట్జ్ ఈవెంట్‌లో మాత్రం మెడల్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. తొలి రోజు సెకండ్ ప్లేస్‌లో నిలిచి.. 14వ ర్యాంక్ వరకూ అదే స్థానంలో కొనసాగి టైటిల్‌పై ఆశలు రేపిన తెలుగమ్మాయి ఆఖర్లో తడబడింది. చివరి మూడు రౌండ్లలో ఓడిపోయి టాప్–10లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో 17 రౌండ్లలో పదిన్నర పాయింట్లు గెలిచి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పది పాయింట్లతో 25వ స్థానం సాధించింది. ఫస్ట్ డే తొమ్మిది రౌండ్లలో ఆకట్టుకున్న హంపి రెండో రోజును కూడా సానుకూలంగా ఆరంభించింది. 10,11వ రౌండ్లలో విజయాలు సాధించి మరో స్వర్ణంపై ఆశలు రేకెత్తించింది. తర్వాతి మూడు గేమ్‌లను డ్రా చేసుకున్నప్పటికీ పదిన్నర పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగడంతో ఏదో ఒక మెడల్ నెగ్గేలా కనిపించింది. కానీ, చివరి మూడు గేమ్స్‌లో ఆమె ఒత్తిడికి గురైంది. 15వ గేమ్‌లో ఓడిపోవడంతో నాలుగో ప్లేస్‌కు పడిపోయిన ఆమె తర్వాతి రౌండ్ కూడా కోల్పోయి ఏడో స్థానానికి వచ్చింది. చివరి గేమ్‌లో కూడా ప్రతికూల ఫలితమే ఎదురైంది. అయితే, తనకు మంచి రికార్డు లేని ఫాస్ట్ చెస్‌లో అద్భుతంగా ఆడి ర్యాపిడ్ టైటిల్ గెలిచిన హంపి సగర్వంగా ఈ టోర్నీని ముగించిందని చెప్పొచ్చు. కాగా, ఓపెన్ కేటగిరీలో రష్యా సూపర్ స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ బ్లిట్జ్ టైటిల్ కూడా నెగ్గాడు. అమెరికా జీఎం హికారు నకామురా రన్నరప్‌గా నిలవగా.. రష్యాకు చెందిన వ్లాదిమిర్ క్రామ్నిక్ మూడో స్థానం సాధించాడు.

