V6 News

ఎలక్ట్రిక్ ఆటోల తయారీకి జతకట్టిన కార్ల దిగ్గజం బైక్స్ కింగ్.. మహీంద్రా, బజాజ్‌లకు పోటీ

ఎలక్ట్రిక్ ఆటోల తయారీకి జతకట్టిన కార్ల దిగ్గజం బైక్స్ కింగ్.. మహీంద్రా, బజాజ్‌లకు పోటీ

ఆటో రంగంలో ఎవ్వరూ ఊహించని కొల్లాబరేషన్ ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్.. భారత టూ-వీలర్ TVS చేతులు కలిపాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను అభివృద్ధి చేయడమే వీరి కలయిక ప్రధాన లక్ష్యం. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో మెరిసిన కాన్సెప్ట్ ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇండియాను గ్లోబల్ ఈవీ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నాయి.

డిజైన్ హుందాయ్.. తయారీ టీవీఎస్
వీరి భాగస్వామ్యం చాలా క్లారిటీగా ఉంది. హుందాయ్ తన గ్లోబల్ ఈవీ నైపుణ్యాన్ని ఉపయోగించి వాహనాల డిజైన్, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్‌ను వాడుతోంటే. మరోవైపు టీవీఎస్ మోటార్ తనకున్న భారీ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ అనుభవంతో వాహనాల తయారీ, మార్కెటింగ్ బాధ్యతలను చూసుకుంటోంది. అంటే విదేశీ టెక్నాలజీకి దేశీయ తయారీ తోడవబోతోంది.

ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి?
వీరి ప్రధాన లక్ష్యం లాస్ట్-మైల్ కనెక్టివిటీ. అంటే చిన్న చిన్న దూరాలకు ప్రయాణికులను చేరవేసే ఆటోలు, ఇ-కామర్స్ డెలివరీ చేసే చిన్న రవాణా వాహనాలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా నగరాల్లోని ఆటో డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్లు, డెలివరీ ఏజెంట్లు, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే చిన్న వ్యాపారుల కోసం ఉత్పత్తుల డిజైన్ చేస్తున్నారు. మహీంద్రా, బజాజ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తూ.. ప్రీమియం క్వాలిటీతో తక్కువ ఖర్చులో ఈవీలను అందించడమే తమ టార్గెట్ అంటున్నాయి కంపెనీలు. 

ఇండియన్ రోడ్ల కోసం..
ఈ త్రీ-వీలర్లు కేవలం విదేశీ మోడల్స్ కావు. మన ఊర్లలో ఉండే గుంతల రోడ్లు, వర్షాకాలంలో నీళ్లు నిలిచే పరిస్థితులు, తీవ్రమైన ఎండలను తట్టుకునేలా ఈవీలను తయారు చేస్తున్నారు. మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో పాటుగా ఎక్కువ సేపు ప్రయాణించినా డ్రైవర్ అలసిపోకుండా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్, వేడి వాతావరణంలో కూడా బ్యాటరీలు హీటెక్కకుండా ఉండే థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మేడ్ ఇన్ ఇండియా.. సేల్స్ ఇన్ గ్లోబల్
టీవీఎస్ హుందాయ్ మధ్య కుదిరిన డీల్ ప్రకారం విడిభాగాలను స్థానికంగానే సేకరించి ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచుతారు. ఇక్కడ తయారైన ఈవీలను కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. సుస్థిరమైన రవాణాను అందుబాటులోకి తెస్తూనే, నాణ్యతలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడమే ఈ టీవీఎస్-హుందాయ్ జంట లక్ష్యం. మొత్తానికి మన రోడ్లపై త్వరలోనే స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు తీయబోతున్నాయన్నమాట.