రోడ్లపై బిల్డింగ్ వేస్టేజ్ డంప్ చేస్తే కేసులు పెడతం: ప్రకాశ్ రెడ్డి

రోడ్లపై  బిల్డింగ్ వేస్టేజ్ డంప్ చేస్తే కేసులు పెడతం: ప్రకాశ్ రెడ్డి

గచ్చిబౌలి, వెలుగు: మెయిన్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బిల్డింగ్ వేస్టేజ్ డంప్​ చేస్తే జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని బల్దియా ఈవీడీఎం (ఎన్​ఫోర్స్ మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్) డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ డంపింగ్, ట్రాన్స్​పోర్టుపై బిల్డర్లు, టిప్పర్, ట్రాక్టర్ డ్రైవర్లతో గురువారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహించిన అవేర్​నెస్ ప్రోగ్రామ్​కు ఆయన చీఫ్​గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... బిల్డింగ్ వేస్టేజ్​ను మెయిన్ రోడ్ల వెంబడి, చెరువుల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 

నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు రాంకీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. టన్ను వ్యర్థాలను తరలించేందుకు రూ.400 చార్జి చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ‘మై జీహెచ్ఎంసీ’ యాప్​ లేదా వాట్సాప్ నంబర్లు 9100927073, 7330000203కు సంప్రదించాలన్నారు. పబ్లిక్ ప్లేసులు, రోడ్ల వెంట బిల్డింగ్ వేస్టేజ్​ను డంప్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ. లక్ష ఫైన్​తో పాటు కేసులు నమోదు చేసి వెహికల్ సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. బిల్డర్లు, టిప్పర్​, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు జీహెచ్ఎంసీ అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో బల్దియా శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి, బల్దియా అధికారులు పాల్గొన్నారు.