నీట్‌‌ పేపర్ లీక్ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌‌

నీట్‌‌ పేపర్ లీక్ కేసులో మరో నిందితుడు అరెస్ట్‌‌

న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ  సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌‌కు చెందిన ప్రముఖ రేణుకాల్ కోచింగ్ సెంటర్ (ఆర్‌‌‌‌సీసీ) అధినేత, ప్రొఫెసర్ శివరాజ్ మోటెగాంకర్​ను అదుపులోకి తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా ఈయనపై సీబీఐ నిఘా పెట్టింది. ఆ వీడియోలో శివరాజ్ మోటెగాంకర్.. తాము నిర్వహించిన కెమిస్ట్రీ మాక్ టెస్ట్ పేపర్ల నుంచి ఎన్ని ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చాయని విద్యార్థులను అడుగుతూ కనిపించారు.

అప్పటి నుంచే ఈయన పాత్రపై అధికారులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. శివరాజ్ మోటెగాంకర్ నడుపుతున్న ఈ కోచింగ్ ఇన్‌‌స్టిట్యూట్ విద్యార్థులను నీట్ యూజీ పరీక్షకు సిద్ధం చేస్తుంది. దీనికి మహారాష్ట్రలో మొత్తం 9 బ్రాంచ్‌‌లు ఉండగా, ప్రధాన బ్రాంచ్ లాతూర్‌‌లో ఉంది. ఈయనకు నేషనల్ టెస్టింగ్‌‌ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ)లో పనిచేసే కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది.