NEET పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి ఇతనే..NTAతో పనిచేసిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి అరెస్ట్

NEET పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి ఇతనే..NTAతో పనిచేసిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని పూణెలో  కులకర్ణిని శుక్రవారం (మే15) సాయంత్రం  సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేషల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ) లోకలిసి పనిచేసిన కులకర్ణి ప్రశ్నాపత్రాలు లీక్ కు స్కెచ్ వేశాడని గుర్తించారు.  కులకర్ణి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో కలిసి నీట్ పరీక్షల ప్రక్రియలో పాలుపంచుకున్నారని, అందువల్ల అతనికి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని NTA తెలిపింది. 

ఎలా లీక్ చేశారంటే.. 

2026 ఏప్రిల్ చివరి వారంలో ఈ కేసులో మరో నిందితురాలైన మనీషా వాఘ్మారే తో కలిసి  నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కుట్రకు తెర లేపినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పూణెలోని తన నివాసంలో ప్రత్యేక కోచింగ్ నిర్వహించిన కులకర్ణి.. ప్రత్యేక తరగతులలో ఆప్షన్లు ,సరైన సమాధానాలతో పాటు ప్రశ్నలను డిక్టేట్ చేశారని తెలిపారు. అతను డిక్టేట్ చేసిన ఈ వివరాలను విద్యార్థులు తమ నోట్‌బుక్‌లలో చేతితో రాసుకున్నారని, అవి నీట్-యూజీ 2026 పరీక్ష అసలు ప్రశ్నపత్రంతో  ఖచ్చితంగా సరిపోలాయని అధికారులు తెలిపారు.

కులకర్ణి లీక్ బాగోతం ఎలా బయటపడిందంటే.. 

సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం, మే 7న రాజస్థాన్‌లో ఈ కేసు తొలుత వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టి సీబీఐ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.  ఈ కేసుతో సంబంధించిన అనేక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసింది. సీబీఐ అధికారుల  దర్యాప్తులో  కులకర్ణి పేపర్ లీక బాగోతం బయటపడింది.  స్వాధీనం చేసుకున్న వస్తువులపై సమగ్ర ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ కొనసాగుతోందని సీబీఐ పేర్కొంది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ మే 12న కేసు నమోదు చేసింది. అనంతరం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. మే 14 నాటికి, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే ,అహ్లియానగర్‌లలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు నిందితులను ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీ రిమాండ్‌కు తీసుకున్నారు.గురువారం అరెస్టు అయిన మిగతా ఇద్దరు నిందితులను ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ నిమిత్తం పూణే కోర్టులో హాజరుపరుస్తున్నారు సీబీఐ అధికారులు. 

రద్దు చేయబడిన ఈ పరీక్ష మే 3న జరగాల్సి ఉండగా, జూన్ 21న తిరిగి నిర్వహించేందుకు ఎన్ టీఏ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షకు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కానున్నారు.