- బిల్లులు చెల్లించకుండానే సీసీఐని స్క్రాప్ కింద తరలించే ప్రయత్నం
- ఏళ్లుగా పేరుకుపోయిన మొండిబకాయిలపై ఫోకస్ పెట్టని ఆఫీసర్లు
- బిల్లులు చెల్లించాలని ఆందోళన బాట పట్టిన సీసీఐ సాధన కమిటీ
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు సిద్ధమైన యాజమాన్యం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఏండ్లుగా విద్యుత్ శాఖ, మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. మూతపడిన సీసీఐని తెరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, కేంద్ర సర్కారు ఫ్యాక్టరీని మూసి వేయాలని నిర్ణయించింది.
ఇందులోభాగంగానే సీసీఐ ఫ్యాక్టరీలోని యంత్రాలు, వాహనాలు విక్రయించేందుకు యాజమాన్యం టెండర్లు ఖరారు చేసింది. అయితే సీసీఐ నుంచి విద్యుత్, ఆస్తి పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సీసీఐ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో విక్రయిస్తే పేరుకుపోయిన బకాయిలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.
రూ.18 కోట్ల కరెంట్ బిల్లు పెండింగ్
ప్రారంభంలో ఎన్నో లాభాలు తెచ్చిన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఆనవాళ్లు కోల్పోతోంది. 1982లో సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించగా, ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోవడంతో 1993లో మూతపడింది. అప్పటి నుంచి కార్మికులతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. సీసీఐలో పని చేసిన 49 మంది కార్మికులకు సంబంధించిన రూ.15 కోట్ల వరకు టెర్మినల్ బెనిఫిట్స్ పెండింగ్ లో ఉండగా, విద్యుత్ శాఖకు రూ.18 కోట్లు బకాయి ఉంది.
పెండింగ్ బకాయిలు వసూలు చేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీసీఐ సాధన కమిటీ నేతలు ఆందోళనకు దిగారు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మున్సిపల్ కార్యాలయం, విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. సీసీఐ యాజమాన్యానికి నోటీసులు పంపించి స్క్రాప్ పనులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
సామాన్యుల బిల్లు ఆలస్యమైతే కరెంట్ కట్ చేసే అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థ కోట్ల రూపాయలు బకాయి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యంత్రాలు తుక్కు కింద విక్రయిస్తుండగా, బకాయిలు ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
రూ.4.44 కోట్ల ఆస్తి పన్ను..
జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్ లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.20 కోట్ల వరకు ఆస్తి పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా సిమెంట్ ఫ్యాక్టరీ రూ.4.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రతి ఏడాది మార్చి చివరి వరకు ఆస్తి పన్నులను పూర్తిగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.
ఈ ఏడాది సైతం సీసీఐకి బల్దియా అధికారులు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. సీసీఐ ఆస్తి పన్ను చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న సామాగ్రిని అమ్ముకుంటున్న యాజమాన్యం, ఆస్తి పన్ను ఎలా చెల్లిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
సిమెంట్ ఫ్యాక్టరీ చెల్లించాల్సిన బకాయిలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫ్యాక్టరీ తెరిపించాలని ఎన్నో ఉద్యమాలు చేశాం. ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు కట్టకుండా తప్పించుకోవాలని చూస్తోంది. అందుకే ఆందోళన బాట పట్టాం. విద్యుత్, ఆస్తి బకాయిలు చెల్లించేంత వరకు స్ర్కాప్ పనులు నిలిపివేయాలి.
– దర్శనాల మల్లేశ్, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్
