గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో చెరువుల రక్షణకు బల్దియా చర్యలు

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో చెరువుల రక్షణకు బల్దియా చర్యలు
  • కబ్జాలు, అక్రమార్కుల నుంచి కాపాడేందుకు బల్దియా చర్యలు 
  • 1,200 సీసీ టీవీ కెమెరాల కోసం ఇటీవల టెండర్లు
  • లేక్ ప్రొటెక్షన్ కమిటీకి త్వరలో స్పెషల్ కమిషనర్‌‌ని నియమించే చాన్స్‌

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో చెరువుల రక్షణకు బల్దియా చర్యలు చేపట్టింది. ఇంతకుముందు చెరువుల ప్రొటెక్షన్‌‌కు గార్డులను ఏర్పాటు చేసిన జీహెచ్‌‌ఎంసీ.. ఇప్పుడు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కొన్ని చెరువుల వద్ద ఒక్కో సమయంలో గార్డులు అందుబాటులో ఉండకపోవడం, మరికొన్ని చెరువుల వద్ద అసలే లేకపోవడంతో సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనుంది. ఈ మేరకు 1,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండేండ్ల పాటు చెరువుల మెయింటెనెన్స్ చేసేలా ఇప్పటికే టెండర్లను పిలిచింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్‌‌‌‌లో 185 చెరువులు ఉండగా, ఇప్పటికే 152 చెరువుల వద్ద ఫస్ట్ ఫేజ్ కింద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చెరువుల కబ్జా, అందులో హానికర వ్యర్థాలను వదలడంతో పాటు తదితరాలను పడేస్తుండటంపై జీహెచ్ఎంసీ అధికారులు కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. చెరువుల ఎఫ్‌‌టీఎల్ హద్దులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించనున్నారు. 

నిరంతర నిఘా

గ్రేటర్‌‌‌‌లో ఇప్పటికే అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. కొన్నిచెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇంకొన్ని ఎఫ్టీఎల్ కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌‌లో చెరువులు మిగిలే పరిస్థితి కనిపించకపోవడంతో జీహెచ్ఎంసీ తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయా? అందులో నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నారా? కెమికల్స్ వదులుతున్నారా? అనే దానిపై నిరంతరం నిఘా పెట్టనుంది. కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా సంబంధిత వ్యక్తులు, వెహికల్స్‌‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు బల్దియా సిద్ధమైంది. 

త్వరలో స్పెషల్ కమిషనర్ నియామకం

హైదరాబాద్‌‌లో చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్‌‌‌‌ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువులకు సంబంధించి జీహెచ్ఎంసీకి రెగ్యులర్‌‌‌‌గా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. చెరువుల పరిరక్షణకు బల్దియాలో ఓ స్పెషల్ కమిషనర్‌‌‌‌ని నియమిస్తామని 2020 సెప్టెంబర్‌‌‌‌లో​మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చెరువులతో పాటు ఇతర జల వనరులను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత కూడా ఈ స్పెషల్ కమిషనర్‌‌‌‌కి అప్పగిస్తామని అప్పట్లో చెప్పారు. దీంతో త్వరలో స్పెషల్ కమిషనర్‌‌‌‌ని కూడా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది. 

ఇప్పటికే రూ.481 కోట్లు ఖర్చు

చెరువుల చుట్టు కంచె ఏర్పాటు, మురుగు నీటి మళ్లింపు, చుట్టూ వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ లైటింగ్, తదితరల పనుల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గతేడాది అత్యవసర రిపేర్ల కోసం రూ.9.42 కోట్లు, మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల పనులు చేపట్టారు. 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగు చేసేందుకు తాజాగా రూ.95.54 కోట్లను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నది. వందల కోట్లు ఖర్చు పెడుతున్నా చెరువుల పరిస్థితి మారడం లేదు. ప్రధాన రహదారులపై ఉన్న ఒకటి, రెండు మినహా ఏ చెరువు వద్ద సౌకర్యాలు లేవు.