టెంపోల్లో డబ్బులు పోతుంటే కండ్లు మూసుకున్నరా? : ఏఐసీసీ చీఫ్

టెంపోల్లో డబ్బులు పోతుంటే కండ్లు మూసుకున్నరా? : ఏఐసీసీ చీఫ్
  •   సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయ్
  •  కేసులు పెట్టి ఇండ్లు జప్తు చేయుండ్రి
  •  ప్రధాని మోదీపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఫైర్
  •  కాంగ్రెస్ అంటే బీజేపీ భయపడుతోంది
  •  జనగణన చేస్తామంటే.. ఆస్తులు లాక్కుంటరంటున్నారు
  •  మోదీది ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం  

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత అంబానీ, అదానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని, వాళ్లకు టెంపోల్లో డబ్బులు వెళ్లాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. ‘టెంపోల్లో డబ్బులు పోతుంటే మీరు కండ్లు మూసుకున్నారా..? మీ సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయ్’ అని ప్రశ్నించారు. అది నిజమే అయితే కేసులు పెట్టి ఇండ్లను జప్తు చేయాల్సిందని అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి కాంగ్రెస్ భయం పట్టుకుందని అన్నారు. 

అందుకే మటన్, చికెన్, బీఫ్, మొఘల్, మంగళ సూత్రం ఇలాంటి చిన్న చిన్న అంశాలను తెరమీదకు తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనగణన చేసి ఆస్తులు లాక్కుంటుందనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. ఇండ్లలోకి వచ్చి మంగళసూత్రాలను లాక్కంటారంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

తాము ఈ దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కులగణన చేయాలనుకుంటున్నామని, అణగారిన వర్గాలకు న్యాయమైన వాటా దక్కాలని కోరుకుంటున్నామని అన్నారు. సివిల్ సర్వీసు ఆఫీసుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా 27 శాతమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారన్నారు. ఆయా వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు.  నల్లధనం తెస్తానంటూ ఓట్లు వేయించుకున్న మోదీ ఆ ప్రయోజనాన్ని తన మిత్రులైన అంబానీ, అదానిలకే ఇచ్చారని చెప్పారు.

 హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆనాడు అంబేద్కర్ చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్ కు ఒక్క పెట్టుబడి కూడా రానీయకుడా గుజరాత్ కు తరలించి వెళ్లింది మోదీ అని విమర్శించారు. హైదరాబాద్, బెంగళూరు ఏం పాపం చేశాయని ప్రశ్నించారు. తమకు ఉత్తర, దక్షిణ భారతాలను వేరన్న భావన లేదని, విశాలభారత సంక్షేమం, అభివృద్ది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని చెప్పారు. 

ఆరు గ్యారెంటీలో ఐదింటిని అమలు చేశాం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరుగ్యారెంటీలను ఇచ్చామని, అందులో ఐదింటిని అమలు చేశామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా రైతాంగానికి రూ. 2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేయలేకపోయామని అన్నారు. రైతుబంధు బకాయిలను కూడా ఇచ్చేశామని అన్నారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలకు త్వరలోనే  పరిహారం అందించనున్నామని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అమలు చేయగలిగిన హామీలనే ఇస్తుందన్నారు. వాటిని అమలు చేసి తీరుతుందని, ఇందుకు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలే నిదర్శనమని అన్నారు.  శ్యాంపిట్రోడా వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నిచగా ఆయన రాజీనామా చేశారని, ప్రస్తుతం దానిపై చర్చే అవసరం లేదని అన్నారు.  పేదల డబ్బులతో నిర్మితమైన పబ్లిక్ సెక్టార్ ప్రైవేటు పరం చేస్తున్నారని, తన మిత్రులకు అప్పనంగా అప్పగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ  ఊరుకోదని అన్నారు.

 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ మంత్రి గీతారెడ్డి ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు.