చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం.. సెప్టెంబర్ 30 వరకు ముడి, తెల్ల చక్కెర ఎగుమతులకు బ్రేక్

చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం.. సెప్టెంబర్ 30 వరకు ముడి, తెల్ల చక్కెర ఎగుమతులకు బ్రేక్

న్యూఢిల్లీ:  చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచి, ధరలను అదుపు చేయడానికి ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 

ముడి చక్కెర (రా షుగర్), తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర (రిఫైన్డ్ షుగర్) ఎగుమతులన్నింటికీ నిషేధం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎగుమతులపై నిషేధం అమల్లో ఉంటుంది. చక్కెర ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో దిగుబడి తగ్గడం, వరుసగా రెండో ఏడాది కూడా ఉత్పత్తి కంటే వినియోగమే ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 

అయితే, ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో ఉన్న వ్యాపారులకు కొంత రిలీఫ్ కలిగిస్తూ మినహాయింపులిచ్చింది. నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే లోడింగ్ ప్రారంభమైనా, షిప్పింగ్ బిల్లులు ఫైల్ చేసి నౌకలు ఓడరేవులకు చేరుకున్నా, కస్టమ్స్ అధికారులకు నిల్వలను అప్పగించినా అటువంటి వాటి ఎగుమతులకు అనుమతి ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం.. యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరికాకు కోటాల కింద చేసే ఎగుమతులకు, ఆహార భద్రత కోసం ఒప్పందాల ద్వారా జరిగే రవాణాలకు నిషేధం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. 

బ్రెజిల్ తర్వాత మన దేశమే ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా ఉంది. అయితే, తాజాగా తీసుకున్న నిషేధ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో చక్కెర ధరల పెరుగుదలకు కారణం కానుంది. మరోవైపు, దేశీయంగా చక్కెర సరఫరా మెరుగుపడి సామాన్యులకు ఊరట లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.