- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి పరిధిలోని సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో యాంత్రీకరణ, గనుల మూసివేత తదితర కారణాలతో నిరుద్యోగం పెరిగిందనడానికి నివేదికలు లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 51:49 ఈక్విటీ కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి నైపుణ్యాభివృద్ధి, ప్రత్యా మ్నాయ జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. 2023–24లో నాలుగు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్, కంప్యూటర్ డీటీపీ, వెల్డింగ్ మొదలైన వాటిలో 721 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇందులో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలోని రామగుండం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు/గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో 225 మందికి నైపుణ్య శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ (సిమ్)తో పాటు మరో ఐదు స్కీమ్‌లు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ స్కీమ్ కింద పెద్దపల్లితో పాటు దేశవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఈ శిక్షణ అందిస్తున్నట్టు సమాధానంలో పొందుపరిచారు.
అలా అయితేనే
నవోదయలు మంజూరు చేస్తం..
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి, శాశ్వత భవనం నిర్మితమయ్యే వరకు తాత్కాలిక భవనాలు (అద్దె లేకుండా) సమకూర్చడం ఆధారంగానే కొత్త జవహార్ నవోదయ విద్యాలయాల(జేఎన్‌వీ) మంజూరు ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక కేవీ ఉండాలనే సంకల్పంతో ఈ స్కీమ్ కొనసాగుతోందని చెప్పింది. పెద్దపల్లి, మంచిర్యాలలో జేఎన్‌వీల ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాతపూర్వక సమా ధానం ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 16 జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీ) మంజూరు కాగా, ప్రస్తుతం 15 స్కూళ్లు పనిచేస్తున్నాయని తెలిపారు.
ప్రసాద్ స్కీమ్ కింద రూ.146.5 కోట్లు
-తెలంగాణలోని పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద రూ.145.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
