సింగరేణిలో సంఘాలను వేధిస్తున్న సర్కారు..ఆర్టీసీ లెక్కనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నరు

సింగరేణిలో సంఘాలను వేధిస్తున్న సర్కారు..ఆర్టీసీ లెక్కనే నిర్వీర్యం చేయాలని చూస్తున్నరు

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ లెక్కనే సింగరేణిని కూడా నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పాలకపక్షంలో లేని ఇతర సంఘాల ప్రతినిధులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై స్వయంగా తానే మేనేజ్​మెంట్​తో మాట్లాడుతాన్నారు. సింగరేణి కోల్ మైన్స్ మజ్దూర్ సంఘ్ కు చెందిన ప్రతినిధులు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత తమకూ ఉంటుందన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్యంగా పోరాడాలని, బీజేపీ అండగా ఉంటుందని తనను కలిసిన వారికి హామీ ఇచ్చారు.

 బీజేపీలో చేరికలు

మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కిషన్ రెడ్డి సమక్షంలో  పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మజ్లిస్​పార్టీని అడుగడుగునా నిలదీయాలని, సీఏఏపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.