అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్

అంతా టీజీ ..  వెహికిల్ నంబర్లతో స్టార్ట్

హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి నాడు ప్రతీకగా నిలిచిన రెండక్షరాలు ‘టీజీ’. చాలా మంది యువకులు తమ గుండెలపై టీజీ అంటూ పచ్చబొట్టు వేయించుకున్నారు. ఆర్టీఏ నిబంధనలను ఉల్లంఘించి తమ వాహనాల నంబర్ ప్లేట్లపై ఏపీ స్థానంలో టీజీ అనే స్టిక్కర్లను అతికించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నంబర్ ప్లేట్లను టీఎస్ గా మార్చింది. దీనికి ప్రజల హృదయాల్లో ముద్రవేసుకున్న పాతరూపమే ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం నుంచి గెజిట్ విడుదల కావడంతో టీజీ నెంబర్ ప్లేట్ తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఇదే క్రమంలో టీఎస్ ఆర్టీసీ కాస్తా టీజీఎస్ ఆర్టీసీగా మారిపోయింది. 

ఇందుకు సంబంధించిన లోగోను కూడా మార్చే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ కూడా మారిపోయింది. ఇప్పుడు టీజీపీఎస్సీగా మార్చేశారు. స్టేట్ అనే పదం క్రమంగా అన్ని కార్పొరేషన్ల బోర్డులు, వెబ్ సైట్ల నుంచి తొలగిపోతోంది. తెలంగాణ స్టేట్ ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్​డీసీ) పేరు కాస్తా టీజీఎఫ్​డీసీ గా మార్పులు చేశారు. తెలంగాణ స్టేట్ మార్క్ ఫెడ్ కాస్తా తెలంగాణ మార్క్ ఫెడ్ గా మారింది. టీఎస్ రెడ్ కో టీజీరెడ్ కోగా చేంజ్ అయ్యింది. తెలంగాణ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి స్టేట్ అనే పదం తొలగించారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ గా మారింది.  

వెబ్ సైట్ల లోనూ మార్పులు చేశారు. టీఎస్ఎండీసీ, తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్లను మార్చాల్సి ఉంది. తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి స్టేట్ అనే  పదాన్ని తొలగించాల్సి ఉంది. ఇప్పటికే చాలా శాఖల్లో స్టేట్ అనే పదం దాదాపుగా డిలీట్ అయ్యింది. జూన్ 2వ తేదీ నాటికి పూర్తిగా అన్ని వెబ్ సైట్ లకు కొత్తరూపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.