సోషల్ మీడియా ఫాట్ ఫారమ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. AI మౌలిక సదుపాయాల కోసం ఇన్వెస్ట్మెంట్ పెంచాలని నిర్ణయించుకున్నందున కంపెనీ దాని కోసం ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మెటాలో సుమారు 79వేల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దాదాపు 16వేల మంది జాబ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.
గతంలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన "ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ" సమయంలో జరిగిన కోతలకు మించి ఈ లేఆఫ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 2022 నవంబర్‌లో 11వేల మందిని, 2023లో మరో 10వేల మందిని మెటా ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏఐ రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు జుకర్‌బర్గ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఏఐ రీసెర్చ్ కోసం వందల మిలియన్ డాలర్ల ప్యాకేజీలు ఆఫర్ చేయడం.. డేటా సెంటర్ల కోసం 2028 నాటికి ఏకంగా 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేయడం జరిగింది.
ఈ పరిణామాల వెనుక మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. గతంలో పెద్దపెద్ద టీమ్స్ చేయాల్సిన పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ సాయంతో ఒక్కరే చేయగలరని జుకర్‌బర్గ్ నమ్ముతున్నారు. అంటే టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల అవసరం తగ్గుతోందనే సంకేతాలను ఇచ్చారు. కేవలం మెటా మాత్రమే కాదు, అమెజాన్ ఇప్పటికే 16వేల మందిని, ఫిన్‌టెక్ దిగ్గజం దాదాపు సగం మంది సిబ్బందిని ఏఐ ఉత్పాదకత పేరుతో తొలగించాయి.
మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ ఈ వార్తలను కేవలం "ఊహాగానాలు" అని కొట్టిపారేసినప్పటికీ.. అంతర్గతంగా మాత్రం ఉన్నత స్థాయి అధికారులకు టీమ్‌లను తగ్గించే ప్లాన్స్ సిద్ధం చేయమని ఆదేశాలు అందినట్లు వెల్లడైంది. 'లామా 4' మోడల్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం.. 'అవకాడో' వంటి కొత్త మోడల్స్ ఆలస్యం కావడం మెటాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఏది ఏమైనా ఏఐ రేసులో నిలవడానికి మెటా చేస్తున్న ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ సామాన్య ఉద్యోగుల పాలిట శాపంగా మారేలా కనిపిస్తోంది. ఏఐలో పెట్టుబడుల కోసం ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేల మందిని ఇళ్లకు పంపించేస్తూ లేఆఫ్స్ మంత్రం జపిస్తున్నాయి.
