ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్: ప్రైవేట్ చాట్‌లకు E2E ఎన్‌క్రిప్షన్ తొలగింపు..

 ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్:  ప్రైవేట్ చాట్‌లకు E2E ఎన్‌క్రిప్షన్ తొలగింపు..

ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న వారికి మెటా సంస్థ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. 8 మే  2026 తర్వాత మెసేజింగ్ సెక్షన్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) అనే ప్రొటెక్షన్ తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది. దీనివల్ల మనం చేసే చాటింగ్ ఇకపై పూర్తి రహస్యంగా ఉండకపోవచ్చు.

సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపితే, అది పంపిన వారికి లేదా పొందిన వారికి మాత్రమే కనిపిస్తుంది. మధ్యలో మెటా సంస్థ కూడా ఆ మెసేజ్‌లను చూడలేదు. దీనినే 'ఎన్‌క్రిప్షన్' అంటారు. కానీ మే 8 తర్వాత ఈ ప్రొటెక్షన్ పోతుంది. దింతో అవసరమైతే మెటా సంస్థ మన చాట్‌ మెసేజులను చూసే అవకాశం ఉంటుంది.

యూజర్లు ఏం చేయాలి: 
ఈ మార్పు వల్ల మీ పాత మెసేజెస్  లేదా ఫోటోలు, ఏవైనా డేటా పోతాయని అనిపిస్తే, వాటిని  సేవ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలని మెటా సూచించింది. మీ పాత చాట్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. మీ చాట్స్  ఈ మార్పు వల్ల ప్రభావితం అవుతుంటే, మీ యాప్‌లోని మెసేజింగ్ ట్యాబ్ కింద దీనికి సంబంధించిన సూచనలు కనిపిస్తాయి.

మెటా ఎందుకు ఇలా చేస్తోంది:
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో కూడా ఇలాగే మారుస్తారా ? లేదా కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కేనా ? అనే విషయాలపై మెటా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ సెక్యూరిటీ ఫీచర్‌ను ఎందుకు తీసేస్తున్నారో కూడా కంపెనీ స్పష్టంగా చెప్పలేదు.

ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి:
ఇప్పటివరకు మనం పంపే ప్రతి మెసేజ్, వీడియో లేదా ఆడియో కాల్‌కి ఒక 'డిజిటల్ లాక్' ఉండేది. ఆ లాక్ తీసే కీ (Key) కేవలం మెసేజ్ పంపిన వారి దగ్గర, పొందిన వారి దగ్గర మాత్రమే ఉంటుంది. దీనివల్ల హ్యాకర్లు గానీ, కంపెనీలు గానీ మన ప్రైవేట్ విషయాలను చూడలేవు. మే 8, 2026 తర్వాత ఈ 'డిజిటల్ లాక్' సిస్టమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పని చేయదు.