Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్

Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్

ఆర్ఆర్ఆర్(RRR) తరువాత రామ్ చరణ్(Ram charan) క్రేజ్ గ్లోబల్ లెవల్లో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అందుకే ఆయన తరువాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్(Shankar) తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. 

ఇక గేమ్ ఛేంజర్ మూవీ పూర్తి కాకుండానే.. దర్శకుడు బుచ్చిబాబుతో మరో సినిమాను మొదలుపెట్టారు రామ్ చరణ్. RC 16 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. రూరల్ బ్యాక్డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక ఈ రెండు సినిమాల తరువాత రామ్ చరణ్ చేయబోయే సినిమాపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. రామ్ చరణ్ మరో తమిళ స్టార్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చారట. ఆ దర్శకుడు మరెవరో కాదు విలక్షణ చిత్రాలు చేసే వెట్రిమారన్. అవును.. ఈ దర్శకుడు ఈమధ్యే రామ్ చరణ్ కి ఓ లైన్ వినిపించాడట. అది విపరీతంగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట రామ్ చరణ్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 

ఇక వెట్రిమారన్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటారు వెట్రిమారన్. ఆయన గత చిత్రాలు డుకాలం, విసారణై, వడాచెన్నై, అసురన్‌, విడుతలై అన్నీ కథా బలంతో వచ్చినవే. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా అదే తరహా కథ సిద్దం చేసుంటారని సమాచారం. ఇక రామ్ చరణ్ కి కథా బలం ఉన్న సినిమాలు పడితే ఎలా ఉంటుందో రంగస్థలంతో ప్రూవ్ అయ్యింది. అందుకే.. వెట్రిమారన్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.