నో రిస్ట్రిక్షన్స్.. మీ ఇష్టం.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితి లేదు: కేంద్రం

నో రిస్ట్రిక్షన్స్.. మీ ఇష్టం.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితి లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు లేదా ఆంక్షలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడటంతో కొన్ని చోట్ల వాహనదారులకు కేవలం రూ.100, 500 ఇలా పరిమితులు విధించి పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ప్యానిక్ బయ్యింగ్ చేస్తు్న్నారు. ఈ క్రమంలో దేశంలోని ఇంధన నిల్వలు, కొనుగోళ్లపై పరిమితులపై క్లారిటీ ఇచ్చింది. 

ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు లేదా ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ఏర్పడిన సరఫరా గొలుసు అంతరాయాల నేపథ్యంలో డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, సహజ వాయువుల సరఫరాలు తగినంతగా ఉన్నాయని.. పౌరులపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎల్‌పీజీ (వంట గ్యాస్) ఉత్పత్తిని పెంచినట్లు తెలిపారు. 

►ALSO READ | నీట్ పేపర్ లీకైందని ఒప్పుకోం.. సీబీఐ విచారణ తర్వాతే అసలు ముచ్చట తెలుస్తది: NTA చీఫ్

సుమారు 1.34 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయని, వాణిజ్య ఎల్‌పీజీ అమ్మకాలు 23,588 టన్నులకు చేరుకున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీని పర్యవేక్షించడానికి, అవకతవకలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 500 చోట్ల దాడులు చేశామన్నారు.

 సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలు స్థిరంగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు, ఆంక్షలు లేవని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కూడా క్లారిటీ ఇచ్చింది.