సరిపడా రైస్ అందుబాటులో ఉంచేందుకు కీలక నిర్ణయం

సరిపడా రైస్ అందుబాటులో ఉంచేందుకు కీలక నిర్ణయం

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు:  ఇప్పటికే  రైస్ (బాస్మతి కాని)  ఎగుమతులపై  20 శాతం ఎక్స్‌‌పోర్ట్ డ్యూటీని విధించిన ప్రభుత్వం తాజాగా నూకల ఎగుమతులను పూర్తిగా బ్యాన్ చేసింది. దేశ అవసరాలకు  సరిపడ రైస్ అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్యం, బియ్యం, సగం ఆడించిన బియ్యం ఎగుమతులపై  20 శాతం ఎక్స్‌‌పోర్ట్‌‌ డ్యూటీని విధిస్తూ గురువారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.  శుక్రవారం నుంచే  ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.  నూకల ఎగుమతులపై బ్యాన్‌‌కు సంబంధించిన  స్టేటస్‌ను   ఎగుమతుల పాలసీలో   ‘ఎటువంటి అడ్డంకులు లేకుండా’ నుంచి ‘నియంత్రించడం’ కు  ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ  నిర్ణయం కూడా శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.

ఈ నెల 9 నుంచి 15 మధ్య నిర్ధిష్టమైన నూకల షిప్‌‌మెంట్లను  ఎక్స్‌‌పోర్ట్ చేసేందుకు అనుమతిస్తున్నామని తాజా నోటిఫికేషన్‌‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌‌టీ)  పేర్కొంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేయక ముందు లోడింగ్ అయిన సరుకును ఎగుమతు చేసేందుకు  అనుమతుస్తున్నామని తెలిపింది. వీటి విషయంలో ఇప్పటికే షిప్‌‌లలో లోడింగ్ పూర్తయ్యిందని, వీటి కోసం వెస్సెల్స్‌‌ (కంటైనర్లు) ఇప్పటికే కేటాయించారని డీజిఎఫ్‌‌టీ వివరించింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ విడుదల కాకముందు కస్టమ్స్ అధికారులకు  హ్యాండోవర్ చేసిన సరుకు ఎగుమతి అవ్వడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.  ఈ టైప్‌‌ సరుకును పోర్టు అధికారుల అనుమతి పొందాకనే కంటైనర్లలో నింపడానికి వీలుంటుందని తెలిపింది. కాగా, దేశంలో నూకల రేట్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 38 శాతం పెరిగాయి. వీటి ఎగుమతులు ఏప్రిల్‌‌–ఆగస్టు మధ్య  21.3 లక్షల టన్నులకు పెరిగాయి. కిందటేడాది ఇదే టైమ్‌‌లో నూకల ఎగుమతులు 15.8 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. 

తగ్గిన వరి సాగు..

అగ్రికల్చర్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం,  తాజా ఖరీఫ్ సీజన్‌‌లో  వరి పంట విస్తీర్ణం 5.62 శాతం తగ్గి 383.99  లక్షల హెక్టార్లుగా రికార్డయ్యింది.   కొన్ని రాష్ట్రాల్లో వానలు తక్కువగా పడడమే ఇందుకు కారణమని వివరించింది. కాగా, రైస్ ప్రొడక్షన్‌‌లో  ప్రపంచంలో రెండో ప్లేస్‌‌లో ఇండియా కొనసాగుతోంది. మొదటి ప్లేస్‌‌లో చైనా ఉంది. ఇండియా  2021–22 లో 2.12 కోట్ల టన్నుల రైస్‌‌ను ప్రొడ్యూస్ చేసింది.  ఇందులో  39.4 లక్షల టన్నులు బాస్మతి రైస్‌‌ ఉంది. 

ప్రభుత్వ డేటా ప్రకారం, కిందటి ఆర్థిక సంవత్సరంలో 6.11 బిలియన్ డాలర్ల విలువైన  నాన్ బాస్మతి రైస్‌‌ను సుమారు 150 దేశాలకు  ఇండియా ఎగుమతి చేసింది. కిందటేడాది రైస్ ప్రొడక్షన్‌‌ 13.2 కోట్ల టన్నులకు పెరిగింది. 2020–21 లో ఇది 12.47 కోట్ల టన్నులుగా రికార్డయ్యింది.   గ్లోబల్‌‌ రైస్ ఎగుమతుల్లో ఇండియా, వియత్నాం,  థాయ్‌‌లాండ్‌‌, మయన్మార్‌‌‌‌ దేశాలు పోటీ పడుతున్నాయి.  ఈ దేశాలు రైస్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయి. చైనా, ఫిలిఫ్పిన్స్‌‌ దేశాలు రైస్‌‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. షార్ట్‌‌ టెర్మ్‌‌లో ఈ దేశాలు రైస్ దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి 
ఉంటుంది.   

రైస్‌‌‌‌  ప్రొడక్షన్ తగ్గుతుంది.. 

ఈసారి రైస్ ప్రొడక్షన్ తగ్గుతుందని, అందుకే ఇతర దేశాల్లో ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతున్నా వీటి ఎగుమతులపై ప్రభుత్వం రిస్ట్రిక్షన్లు పెట్టిందని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే అన్నారు. 2022–23 లోని పంట చేతికొచ్చే టైమ్‌‌లో  రైస్ ప్రొడక్షన్‌‌  కనీసం 70 నుంచి 80 లక్షల టన్నులు తగ్గొచ్చని అంచనావేశారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడమే ఇందుకు కారణమన్నారు. అధ్వాన్న పరిస్థితుల్లో  రైస్ ప్రొడక్షన్  1.2 కోట్ల టన్నులు తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు.

కరువు వలన నాలుగు రాష్ట్రాలలో  వరి సాగు 25 లక్షల హెక్టార్లు తగ్గిందని పేర్కొన్నారు. దేశంలో వరి సాగు విస్తీర్ణం  383 లక్షల హెక్టార్లకు దిగొచ్చిందని అన్నారు. ఫలితంగా ఈసారి వరి సీజన్‌‌లో రైస్ ప్రొడక్షన్ తగ్గొచ్చని వివరించారు. తాజాగా దేశం నుంచి రైస్ ఎగుమతులు పెరగడం చూస్తున్నామని,  అందుకే ప్రభుత్వం వీటి ఎక్స్‌‌పోర్ట్స్‌‌పై రిస్ట్రిక్షన్లు పెట్టాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ రైస్ ప్రొడక్షన్‌‌లో  ఇంకా మిగులు స్థాయిలోనే ఉన్నామని చెప్పారు.