పీఎం కుసుమ్ ప్రాజెక్టు మరో ఏడాది పొడిగింపు

పీఎం కుసుమ్ ప్రాజెక్టు మరో ఏడాది పొడిగింపు
  • రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో 2027 మార్చి వరకు గడువు పెంచిన కేంద్రం
  • ప్రాజెక్టు పనులకుతొలగిన అడ్డుంకులు
  • రాష్ట్రంలో ఈ స్కీమ్ కింద1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన పీఎం కుసుమ్ ప్రాజెక్టు పనుల గడువును మరో ఏడాది  పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో 2027 మార్చి వరకు గడువు పెంచింది. రాష్ట్రంలో ఈ స్కీమ్​ కింద రైతుల భూముల్లో  రూ.6 వేల కోట్లతో 1,796 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రెడ్​ కో అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా 2019 మార్చిలో ప్రారంభించిన ఈ స్కీమ్​ను గత బీఆర్ఎస్ ​ సర్కారు పట్టించుకోలేదు.  ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రీన్​ఎనర్జీలో భాగంగా ఈ స్కీం అమలుపై  దృష్టిపెట్టారు. ఏడాదిన్నర కాలంగా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి ఈ ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. తీరా పనులు మొదలుపెట్టగానే కేంద్ర ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసింది. దీంతో బ్యాంకర్లు నిధులు ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం  కేంద్రాన్ని కోరింది.  

75 శాతానికి పైగా బ్యాంకుల నిధులే

పీఎం కుసుమ్​ స్కీమ్​లో ఒక మెగావాట్​ విద్యుత్​ ఉత్పత్తికి సుమారు. 3.25 కోట్ల చొప్పున మొత్తం రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతున్నది. ఇందులో 75 శాతానికి పైగా నిధులను బ్యాంకులు రుణాలుగా అందిస్తున్నాయి. మిగతావి రైతులే పెట్టుబడిగా పెట్టి విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో బ్యాంకుల నుంచే రూ.4,500 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేయడానికి డిస్కమ్​లతో పవర్​ పర్చేస్​ అగ్రిమెంట్లు (పీపీఏ) చేసుకున్నారు.

ఇందులో ఎన్​పీడీసీఎల్​ పరిధిలో 436 మంది రైతులు 631.9, ఎస్​పీడీసీఎల్​ పరిధిలో 720 మంది రైతులు 1,164.4 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్ల పనులను మొదలుపెట్టారు. మొత్తం 33 సర్కిళ్ల పరిధిలో పనులు మొదలయ్యాయి. ఎస్​బీఐ, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్, బ్యాంక్  ఆఫ్  బరోడా, యూనియన్​ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతన్నలు.. సోలార్​ పవర్​ ప్లాంట్ల పనులు ప్రారంభించారు. సిరిసిల్ల వంటి చోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా చాలా చోట్ల పెండింగ్​లో ఉన్నాయి.

అయితే ఈ స్కీమ్​ కోసం ఇచ్చిన గడువు ముగియడంతో బ్యాంకర్లు నిధులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఈ విషయం రైతుల నుంచి రెడ్​కో ఆఫీసర్లకు తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెడ్​కో ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లి మరీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడంతో 2027 మార్చి వరకు గడువు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడాదిలోపు ప్రాజెక్ట్​ పూర్తి చేస్తాం

రాష్ట్రంలో పీఎం కుసుం ప్రాజెక్టు​ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది గడువు పెంచింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్న రైతులకు మేలు జరిగింది. బ్యాంకర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులు మంజూరు చేయడానికి వీలవుతుంది. రాష్ట్రంలో వచ్చే మార్చి నాటికి మొత్తం 1,796 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ప్రాజెక్టు కంప్లీట్​ చేస్తాం.- అనిల, రెడ్​కో వైస్​చైర్మన్​ అండ్​ ఎండీ,  హైదరాబాద్