- ఖాళీ చేసేందుకు విముఖత!
- చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టని బస్వరాజు శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర దేవాదాయ శాఖలో చాంబర్ లొల్లి మొదలైంది. హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో గల ఎండోమెంట్ హెడ్ ఆఫీస్వేదికగా కొత్త చైర్మన్, ధార్మిక సలహాదారు మధ్య సీటు వార్ నడుస్తోంది. ఇటీవల ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు కేటాయించిన చాంబర్‌లో ధార్మిక సలహాదారు గోవింద హరి కూర్చుంటుండటంతో వివాదం ముదిరింది. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయం నుంచే రాష్ట్రంలోని అన్ని ఆలయాల పర్యవేక్షణ జరుగుతోంది.
ఇక్కడే బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కోసం ఒక ప్రత్యేక చాంబర్ ఉంది. గత కొన్నాళ్లుగా చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో.. ధార్మిక సలహాదారు గోవింద హరి ఆ చాంబర్‌లో కూర్చుంటున్నారు. ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించినా.. సలహాదారు మాత్రం ఆ చాంబర్‌ను ఖాళీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో తన సీటు తనకు కేటాయించకపోవడంతో బస్వరాజు శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన తర్వాత దాదాపు అందరూ బాధ్యతలు స్వీకరించారు.
కానీ, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ మాత్రం ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. చాంబర్ ఖరారు కాకపోవడమే ఇందుకు ప్రధాన అడ్డంకిగా మారింది. అడ్వైజర్ పట్టువీడకపోవడంతో శాఖలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చైర్మన్‌శ్రీనివాస్ చాంబర్ పంచాయితీని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.
