దిశ కేసులో చార్జ్ షీట్ రెడీ

దిశ కేసులో చార్జ్ షీట్ రెడీ

    నెలాఖరు లోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫైల్ చేసేలా ఏర్పాట్లు

    సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ విచారణకు ముందే దాఖలు?

    కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్

దిశపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేరం జరిగిన నెల రోజుల్లోపే చార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు వాళ్లు ప్లాన్ చేస్తున్నారు. నిందితులైన మహ్మద్ ఆరిఫ్ తో పాటు జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు కలిసి దిశపై జరిపిన అత్యాచారాన్ని నిరూపించేందుకు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. 58 మందికి పైగా సాక్షులు, వందల సంఖ్యలో ఆధారాలతో కూడిన చార్జ్ షీట్ ను మహబూబ్‌నగర్‌ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విషయమై సుప్రీంకోర్టు ఏర్పాటు
చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ ప్రారంభానికి ముందే చార్జ్ షీట్ ఫైల్ చేసేలా సైబరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

అన్ని ఆధారాల సేకరణ

దిశ కేసును సవాల్ గా తీసుకుని 7 స్పెషల్ టీమ్స్ తో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో షాద్ నగర్ ఏసీపీ సురేంద్ర కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా వ్యవహరించారు. దిశ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్, డీఎన్‌ఏ, లీగల్ ప్రొసీడింగ్స్‌ కోసం టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీల ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్, క్లూస్ టీమ్ అందించిన ఆధారాలను కోర్టులో డిపాజిట్ చేయడం కోసం మరో రెండు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు చేపట్టేలోపు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు డాక్యుమెంట్స్ రెడీ చేస్తున్నారు. అఫెన్స్ జరిగిన నవంబర్ 27 మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు 28 తెల్లవారుజాము 4.30 గంటల వరకు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ లను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్, డీఎన్ఏ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు ఫింగర్ ప్రింట్స్ నివేదికలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. సీన్ ఆఫ్ అఫెన్స్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇంపీరియల్ బ్లూ మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలపై ఫింగర్ ప్రింట్స్, దిశ బైక్ పై ఉన్న నిందితుల ఫింగర్ ప్రింట్స్ తో కూడిన రిపోర్టులు పోలీసుల చేతికి అందాయి. ప్రధాన నిందితుడైన ఆరిఫ్ కాల్ డేటాను చార్జ్ షీట్ తో కలిపి కోర్టుకు అందించనున్నారు.

సాక్షులు వీళ్లే..

నిందితులు వాడిన లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆ రోజు డ్యూటీలో ఉన్న టోల్‌గేట్‌ సిబ్బంది, పంక్చర్‌ షాపుకు చెందిన మహ్మద్ శంషీర్ ను చార్జ్ షీట్ లో ప్రధాన సాక్షులుగా పేర్కొన్నారు. నిందితులు మద్యం కొనుగోలు చేసిన హైవే 44 వైన్‌షాపు సిబ్బందిని, దిశ డెడ్ బాడీని దహనం చేసేందుకు పెట్రోల్ కొనుగోలు చేసిన కొత్తూరు, నందిగామ పెట్రోల్‌ బంకుల సిబ్బందిని లిస్ట్ ఆఫ్ విట్నెస్ ల జాబితాలో చేర్చారు. ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న షాద్ నగర్ ఏసీపీ సురేంద్ర, ఇన్ స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తో పాటు ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్ సాక్షులుగా ఉన్నారు. పాల వ్యాపారి సత్తయ్య యాదవ్, పంచనామా నిర్వహించిన షాద్ నగర్ తహసీల్దార్ పాండునాయక్ లను పంచ్ విట్నెస్ లుగా పేర్కొన్నారు.