చేవెళ్ల, వెలుగు: రాయల్ సెల్యూట్, చివాస్ రీగల్, గ్లాన్ విచ్ వంటి ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ కలిపి, తక్కువ ధరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్న ముఠాను రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ. 3 లక్షలకు పైగా విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్ పెద్దపెద్ద ఈవెంట్లలోని లిక్కర్ కౌంటర్లలో పనిచేస్తున్నారు.
అత్తాపూర్‌లో నివాసముండే కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్చంద్ర వీరిని పరిచయం చేసుకున్నాడు. తాను పెట్టుబడి పెడతానని ఒప్పందం చేసుకొని, కొండాపూర్ పరిధిలోని గుట్టలబేగంపేటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఆ ఇద్దరూ ఈవెంట్లలో ఖరీదైన లిక్కర్ బాటిళ్లను సేకరించి, అందులో ఐకాన్, ఇతర చీప్ లిక్కర్ మద్యం, కొద్దిగా నీటిని కలిపి మిక్సింగ్ చేసి, ఒరిజినల్ బాటిళ్లలాగే రీ-ప్యాక్ చేసేవారు.
అనంతరం శరత్ చంద్ర ద్వారా రూ. 25,100 ధర కలిగిన రాయల్ సెల్యూట్‌ను రూ. 8 వేలకు, రూ. 9,090 ఖరీదైన చివాస్ రీగల్‌ను రూ. 4 వేలకు, రూ. 7,190 ఖరీదైన గ్లాన్ విచ్ బాటిల్‌ను రూ. 3 వేలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్మేవారు. ఇందులో వచ్చిన లాభాలను ముగ్గురూ సమానంగా పంచుకునేవారు.
గురువారం పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాశ్ చందర్, ఎస్సై అఖిల్ తమ సిబ్బంది రాజేశ్, శంకర్, అనసూయ, శ్యాముల్తో కలిసి దాడులు నిర్వహించారు. ఖరీదైన మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలు, వాటి మూతలను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ తెలిపారు.
