ఛాతినొప్పి గుండె జబ్బేనా?

ఛాతినొప్పి గుండె జబ్బేనా?

ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్‌‌‌‌‌‌‌‌ కున్నత్‌‌‌‌(కేకే) కార్డియాక్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ వల్ల చనిపోయిన విషయం తెలిసిందే. నిజానికి తన ఆరోగ్యం, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు ఆయన. కేకేలానే చాలామంది హెల్త్‌‌‌‌ పట్ల ఎంత కేర్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా కార్డియాక్ అరెస్ట్‌‌‌‌ వల్ల చనిపోయారన్న వార్తలు ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు? ఎలాంటి డైట్​  ఫాలో అవ్వాలి? వంటి విషయాల గురించి కన్సల్టెంట్‌‌‌‌ కార్డియాలజిస్ట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రణీత్‌‌‌‌ ఇలా చెప్పారు. ఈ కాలంలో లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌తో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. దానివల్ల మనకు తెలియకుండానే అనుకోని రోగాల బారిన పడుతున్నాం. వాటిల్లో ఒకటి కార్డియాక్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌. చాలామంది కార్డియాక్ అరెస్ట్‌‌‌‌, హార్ట్ ఎటాక్ రెండూ ఒకటే అనుకుంటారు. నిజానికి ఇవి రెండూ వేర్వేరు. 

రెండింటి మధ్య తేడా ఏంటంటే...
కార్డియాక్ అరెస్ట్‌‌‌‌లో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కానీ, గుండెకు బ్లడ్‌‌‌‌ సర్క్యులేషన్ జరగదు. దాంతో గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఒక్కసారిగా కిందపడిపోతారు. ఇలా కాకుండా ఉన్నట్టుండి ఛాతిలో నొప్పిగా ఉండి, గుండె బరువుగా అనిపిస్తే దాన్ని హార్ట్‌‌‌‌ ఎటాక్ అంటారు. కొందరిలో హార్ట్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ ... కార్డియాక్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌గా మారే అవకాశం ఉంది. 

ఛాతిలో నొప్పి హార్ట్‌‌‌‌ ఎటాకేనా? 
కొందరు ఛాతిలో నొప్పి వస్తుంటే ‘హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ ఏమో’ అని భయపడుతుంటారు. కానీ, ప్రతీ ఛాతి నొప్పి హార్ట్‌‌‌‌ ఎటాక్ లక్షణం కాదు. కొన్నిసార్లు గ్యాస్‌‌‌‌ ట్రబుల్ వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తుంది. అలాగని ఛాతి నొప్పిని మామూలుగా తీసుకోవద్దు. ఎసిడిటీ పెరిగినప్పుడు ఇలా అవుతుంది. తిన్న తరువాత, ఫాస్టింగ్‌‌‌‌ చేసిన తరువాత లేదా మసాలా ఫుడ్ తిన్నాక వస్తే అది గ్యాస్ట్రిక్‌‌‌‌ ట్రబుల్‌‌‌‌. ఈ నొప్పి యాంటాసిడ్స్ వాడితే తగ్గుతుంది. అదే హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్ అయితే నడిచినా, బరువులు ఎత్తినా, మెట్లు ఎక్కుతున్నా, జాగింగ్ చేస్తున్నా ఛాతిలో నొప్పిగా  అనిపిస్తుంది. ఆ నొప్పి రెస్ట్‌‌‌‌ తీసుకుంటే తగ్గిపోతుందంటే దాన్ని హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ అనుకోవాలి. అంతేకాకుండా చెమటలు విపరీతంగా పట్టడం... వికారంగా అనిపించడం.. ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కూడా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌గానే గుర్తించాలి. 

ఫిట్‌‌‌‌గా ఉన్నా...
హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ అనేవి వయసు మీద పడుతుంటే వస్తాయి. అంతేకాదు బీపీ, షుగర్‌‌‌‌, కొలెస్ట్రాల్‌‌‌‌, ఒబెసిటీ ఉన్నవాళ్లు... ‌‌‌‌పొగతాగడం, మద్యపాన అలవాట్లు ఉన్నవాళ్లు కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగతాగడం, మద్యపానం అలవాట్లు ఉన్నవాళ్లు వాటిని మానకుండా, ఆరోగ్యంగా ఉండాలని ఎంత ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసినా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ బారిన పడకుండా ఉండటం కష్టం. అందుకే ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ ఎక్కువగా 40 ఏండ్లు పైబడిన మగవాళ్లకు, 50 ఏండ్లు పైబడిన ఆడవాళ్లకు వస్తుంటాయి. పైన చెప్పుకున్న అన్నింటితో పాటు జెనెటిక్ ప్రాబ్లమ్‌‌‌‌ వల్ల కూడా గుండె సమస్య వస్తుంది.

30ఏండ్ల వాళ్లకు కూడా
ఈ మధ్య 30 ఏండ్లు ఉన్న వాళ్లకు కూడా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.  దీనికి కారణం అనారోగ్యకరమైన అలవాట్లతో పాటు, జెనెటిక్ లోపం కూడా. అంటే కుటుంబంలో ఇది వరకు ఎవరికైనా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్ ఉంటే ఆ కుటుంబంలో ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రిమెచ్యూర్‌‌‌‌‌‌‌‌ కార్డియోవాస్క్యులర్ డిసీజ్‌‌‌‌ అంటారు. ఇంట్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మిగిలిన వాళ్లు డాక్టర్‌‌‌‌‌‌‌‌కు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా చూపించుకుంటుండాలి‌‌‌‌. 20 నుంచి 30 శాతం పేషెంట్లలో ఇది ఫలానా వ్యాధి అని నిర్దారించలేం. అందుకని ఈసీజీ తీయించాలి. కొన్నిసార్లు మొదట చేసిన ఈసీజీ టెస్ట్‌‌‌‌లో హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ ఉందని బయటపడదు. అందుకని గంటా రెండు గంటలు ఆగి ఈసీజీ టెస్ట్‌‌‌‌ చేస్తుంటారు. ఇదే కాకుండా అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్‌‌‌‌ కూడా చేస్తారు. దీని ద్వారా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ ఉందో లేదో 90% తెలుస్తుంది. కొన్నిసార్లు ఈసీజీలో బయటపడకున్నా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్ ఉండే 
అవకాశం ఉంది. 

వీలైనంత తొందరగా...
గుండె మీద ఒత్తిడి పెరగడం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్‌‌‌‌ అవుతుంది. అలాంటప్పుడు ఒత్తిడి పెంచే పనిని మానేసి బాగా గాలి ఆడే ప్లేస్‌‌‌‌లోకి తీసుకెళ్లాలి. హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ ఎమర్జెన్సీ కాబట్టి ఛాతిలో నొప్పి అనిపించినా, గుండె భారంగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా వెంటనే సాధ్యమైనంత తొందరగా దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌‌‌‌కి తీసుకెళ్లాలి.  

జెనెటికల్‌‌‌‌గా గుండె సమస్యలు ఉన్నవాళ్లు ముందుగా ఫిజిషియన్‌‌‌‌ను కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకోవాలి. టెస్ట్‌‌‌‌లు చేయించుకొని హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ వచ్చే అవకాశం ఉందా? లేదా? తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి.  డైట్‌‌‌‌ ఫాలో కావాలి. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేసేటప్పుడు మరీ బరువులు ఎత్తేవి చేయొద్దు. బరువులు ఎత్తడం వల్ల కూడా గుండె మీద ఒత్తిడి పడుతుంది. మానసికంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌లను కంట్రోల్‌‌‌‌లో పెట్టుకోవాలి. బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా ఎలాంటి సప్లిమెంట్స్‌‌‌‌, స్టెరాయిడ్స్‌‌‌‌ వాడకూడదు.  వాటివల్ల కూడా హార్ట్‌‌‌‌ ప్రాబ్లమ్స్ వస్తాయి. అతిగా కాకుండా మితంగా తినాలి. రోజూ ఒక అరగంట ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌, మెడిటేషన్‌‌‌‌ చేయడం అవసరం.

ఇవి తింటే గుండె పదిలం
గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తినే ఫుడ్‌‌‌‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు హెల్త్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌

  • ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌ ఉన్న ఫుడ్ ఎక్కువ తినాలి. చేపలు, వాల్‌‌‌‌నట్స్‌‌‌‌, అవిసె, రాజ్మా (బీన్స్‌‌‌‌) గింజల్లో ఒమెగా -3 ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌‌‌‌ తగ్గిస్తుంది. 
  • పప్పుల్లో అన్ని రకాల పోషకాలతో పాటు, ఫైబర్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్‌‌‌‌‌‌‌‌ లెవల్స్‌‌‌‌ని కంట్రోల్‌‌‌‌లో పెడుతుంది. దీనివల్ల డయాబెటిస్‌‌‌‌, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్రౌన్‌‌‌‌ రైస్‌‌‌‌ కూడా హెల్త్‌‌‌‌కు మంచిది. 
  • పండ్లు, కూరగాయల్లో విటమిన్‌‌‌‌ - ఎ, సి, ఇలతో పాటు పొటాషియం, ఫోలిక్‌‌‌‌ యాసిడ్‌‌‌‌ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. 
  • శాచ్యురేటెడ్‌‌‌‌ ఫ్యాట్‌‌‌‌ ఉన్న రెడ్‌‌‌‌ మీట్‌‌‌‌,  గొర్రె మాంసం తినడం తగ్గించాలి. వీటివల్ల ఎల్‌‌‌‌డిఎల్‌‌‌‌ కొలెస్ట్రాల్‌‌‌‌ పెరిగి రక్త కణాలు బ్లాక్‌‌‌‌ అయ్యే అవకాశం ఉంది. చీజ్‌‌‌‌, ఐస్ క్రీమ్స్‌‌‌‌, బటర్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ తినకపోవడం మంచిది.    

     డా. పి. ప్రణీత్​
    కన్సల్టెంట్​, కార్డియాలజిస్ట్​, కేర్​ హాస్పిటల్స్​, బంజారాహిల్స్​ హైదరాబాద్​