కిలో చికెన్​ రూ.300

కిలో చికెన్​ రూ.300
  • రైతుకు దక్కేది 4.50
  • కార్పొరేట్ల గుప్పిట్లో పౌల్ట్రీ రంగం
  • కోళ్లను పెంచినోళ్లకు కూలి కూడా పడ్తలేదు
  • ఇంటిగ్రేటెడ్​ విధానంతో మార్కెట్​ను శాసిస్తున్న కార్పొరేట్​ కంపెనీలు
  • గొడ్డు చాకిరీ చేసినా గ్రోయింగ్​ చార్జీలు పెంచట్లే
  • కంపెనీల ఆగడాలను అడ్డుకోని సర్కారు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఒకప్పుడు  సొంతంగా కోళ్ల ఫారాలను ​పెట్టుకొని మార్కెటింగ్​ చేసుకున్న రైతులు.. కార్పొరేట్​ కంపెనీల ఆగడాల వల్ల ఇప్పుడు కోళ్లను పెంచలేని, పెంచితే అమ్మలేని స్థితికి చేరుకున్నారు. హేచరీల నుంచి పిల్లలను, దాణా కంపెనీల నుంచి ఫీడ్​ను కార్పొరేట్​ కంపెనీలు తెచ్చిస్తే రైతులు కేవలం కోళ్లను పెంచి ఇచ్చే కూలీలుగా మారిపోయారు. చాకిరీ చేసేది రైతులైతే లాభాలన్నీ కార్పొరేట్‌‌‌‌ కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. కంపెనీల ఆగడాలకు ప్రభుత్వం ముకుతాడు వేయకపోవడంతో రైతులకు కనీసం కూలి పైసలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఏటా వందలాది రైతులు ఇంటిగ్రేటెడ్​ పౌల్ట్రీ ఇండస్ట్రీని వదిలిపెడ్తుండగా.. ఇది తప్ప వేరే పని తెలియని వాళ్లు గ్రోయింగ్‌‌‌‌ చార్జీలు పెంచాలంటూ వేడుకుంటున్నారు. 

పూర్తిగా కమ్మేసిన కార్పొరేట్లు

రాష్ట్రంలో సుమారు 30 వేలకు పైగా బ్రాయిలర్‌‌‌‌ కోళ్ల ఫారాలుండగా 2.5 కోట్లకు పైగా కోళ్ల పెంపకం జరుగుతున్నది. ఈ కోళ్ల ఫారాలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. గతంలో రైతులే స్వయంగా కోడిపిల్లలను, దాణా, మందులను కొని కోళ్లను పెంచి మార్కెట్‌‌‌‌లో హోల్​సేల్​వ్యాపారులకు అమ్ముకునేవాళ్లు. క్రమంగా ఈ వ్యాపారంలోకి  కార్పొరేట్​ కంపెనీలు ప్రవేశించి ఇంటిగ్రేటెడ్‌‌‌‌ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో కోడి పిల్లలను, దాణాను, మందులను కార్పొరేట్‌‌‌‌ కంపెనీలే సప్లయ్‌‌‌‌ చేసి, పెంపకానికి రైతులకు అప్పగిస్తున్నాయి.

ఇందుకోసం కిలోకు రూ. 4.5 చొప్పున గ్రోయింగ్ ​చార్జీలు చెల్లిస్తున్నాయి. మొదట్లో ఈ కంపెనీలు రైతుల నుంచి వాళ్లు చెప్పిన రేటుకే కోళ్లను కొని మార్కెటింగ్ ​చేశాయి. క్రమంగా మార్కెట్​పై పట్టు సాధిస్తూ హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయి ఇంటిగ్రేటెడ్ ​విధానానికి తెరతీశాయి. కొన్ని హేచరీలే స్వయంగా కంపెనీల అవతారమెత్తాయి. తమ దగ్గరే కోడి పిల్లలు, ఫీడ్​ కొని,  తమకే అమ్మడం తప్ప వేరే గత్యంతరం లేని స్థాయికి రైతులను దిగజార్చాయి. రైతులను కూలీలుగా మార్చి, వాళ్ల షెడ్లలోనే కోళ్లను పెంచి, వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

గొడ్డు చాకిరీ చేసినా గ్రోయింగ్​ చార్జీలు పెంచట్లే..

కంపెనీలు తెచ్చిన ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ విధానం వల్ల  రైతులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. కోడి పిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కోళ్లను లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే వరకు శ్రమంతా రైతులదే. కోళ్ల ఫారాల దగ్గర లేబర్‌‌‌‌‌‌‌‌ ఖర్చు, వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లు, ఉనక, కోళ్ల లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ఖర్చులన్నీ రైతులే భరించాలి. కానీ కంపెనీలు కోడిపిల్లకు రూ. 34, దాణాకు కిలోకు రూ. 47, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జెస్​ పేరిట ఒక్కో కోడిపిల్లకు రూ. 6 చొప్పున ఖర్చు రాసి లెక్కలు వేస్తున్నాయి. మందులకు అదనపు చార్జీలు మోపుతున్నాయి. ఇక కోళ్లను లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాత సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లెక్కతీస్తే కేజీ చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు కావడానికి రూ. 95కు మించ రాదు. అప్పుడే రైతుకు కేజీకి రూ. 5.80 చొప్పున చెల్లిస్తామని కంపెనీలు చెప్తున్నాయి. కానీ ఈ ఖర్చు పెరుగుతుండడంతో రైతుకు చెల్లించే డబ్బుల నుంచి ప్రతి రూపాయికి 50 పైసల చొప్పున కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ఈ కటింగ్​లు పోగా.. కోళ్ల ఫారాల్లో  పెంచిన కోళ్లకు కిలోకు కంపెనీలు రైతులకు చెల్లించే గ్రోయింగ్​ చార్జీ రూ.4.50కు మించడం లేదు. కొందరు రైతులకైతే ఆ నాలుగున్నర రూపాయలు కూడా రావడం లేదు. కూలి రేట్లు, ఉనక‌‌‌‌‌‌‌‌ ఖర్చు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు, లోన్లకు వడ్డీలు, ఇతరత్రా మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చులు పెరిగిపోవడంతో తమకు కంపెనీలు ఇచ్చేది ఏమూలకూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంపెనీల ఆగడాలను అడ్డుకోని సర్కారు

ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బ్రాయిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌల్ట్రీ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేని యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వయం ఉపాధిలో  భాగంగా ఊర్లలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కుదవబెట్టి బ్యాంకుల నుంచి లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. కానీ ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో కార్పొరేట్​ కంపెనీలన్నీ సిండికేట్​అయి గ్రోయింగ్ ​చార్జీలు పెంచకుండా రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో లక్షలాది యువ రైతులు అప్పుల పాలవుతున్నారు. ఏటా వందలాది రైతులు బ్రాయిలర్​ కోళ్ల పరిశ్రమ నుంచి బయటికి వస్తుండగా.. విధిలేని వాళ్లు గ్రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు పెంచాలని కోరుతున్నారు. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీల కోడిపిల్లలను దింపుకోబోమని కొన్ని యూనియన్ల ఆధ్వర్యంలో లేఖలు ఇస్తున్నారు. కేజీ కోడికి రూ.12 చొప్పున గ్రోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించాలనే డిమాండ్​ను ముందుపెట్టారు. కానీ రాజకీయ పలుకుబడి ఉన్న కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఏ రకంగా స్పందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మార్కెట్లో కిలో చికెన్ ​రేటు రూ.300 దాటింది. లైవ్​ బర్డ్ అయితే కిలో రూ.162​ పలుకుతున్నది. 

కానీ కోడిని పెంచిన రైతుకు కిలోకు దక్కుతున్నది రూ. 4.50 (గ్రోయింగ్​ చార్జీలు) మాత్రమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమను కొన్ని కార్పొరేట్​శక్తులు తమ గుప్పిట్లోకి తీసుకుని పౌల్ట్రీ రైతులను కూలీలుగా మార్చేశాయి. గడిచిన పది, పన్నెండేండ్లలో రకరకాల పేర్లతో పుట్టుకొచ్చిన పలు కార్పొరేట్​ కంపెనీలు హేచరీలను, ఫీడ్​ కంపెనీలను కలుపుకొని హోల్​సేల్​, రిటైల్​ మార్కెట్లను శాసిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్​ విధానంతో పౌల్ట్రీ రైతుల బతుకులను ఆగం చేస్తున్నాయి. 

5 వేల కోళ్లు పెంచి ఇచ్చినా రూపాయి ఇయ్యలే

మా కోళ్ల ఫారంలో ఓ కార్పొరేట్‌‌‌‌ కంపెనీకి చెందిన 5 వేల కోడిపిల్లలను 42 రోజుల పాటు పెంచి ఇచ్చినా ఆ కంపెనీ మొత్తం కోళ్లను అమ్ముకొని మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. లేబర్‌‌‌‌ చార్జీలు, ఉనక, కరెంట్‌‌‌‌ బిల్లు తదితర ఖర్చుల రూపంలో నాకు ఉల్టా రూ. 60 వేల నష్టం వచ్చింది. ప్రొడక్షన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ పెరిగిందని మొత్తం డబ్బులను ఇవ్వకుండా కంపెనీ వాళ్లు నాకు మొండిచెయ్యి చూపించారు.
‒ వజీరు రాజు, ఇంటిగ్రేటెడ్‌‌‌‌ బ్రాయిలర్‌‌‌‌ కోళ్ల ఫారం రైతు, శాయంపేట, హనుమకొండ జిల్లా


సుమారు 10 వేల కోడిపిల్లలు పెంచే కోళ్లఫారంలో 42 రోజుల పాటు ఉండే ఒక బ్యాచ్‌‌‌‌పై  రైతుకు రూ.10 వేలకు మించి మిగలడం లేదు. అదే 5 వేల లోపు కోళ్లను పెంచే చిన్న రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కానీ కంపెనీలు మాత్రం పెరిగిన ధరలతో సంబంధం లేకుండా సుమారు 10 వేల కోళ్లను పెంచే ఒక కోళ్ల ఫారం నుంచి రూ. 6 లక్షల నుంచి 9 లక్షల వరకు మిగుల్చుకుంటు న్నాయి. ఈలెక్కన వాటి టర్నోవర్​ వందల కోట్లలో ఉంటుందని పౌల్ట్రీ రంగంలోని నిపుణులు చెప్తున్నారు.  

గ్రోయింగ్​ చార్జీలు పెంచి ఇవ్వాలి

బ్రాయిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోళ్ల పెంపకంలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం వల్ల కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలే లాభ పడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిలో చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 300 కు అమ్ముతున్నా కోళ్లను పెంచే రైతులకు మాత్రం కిలోకు రూ. 4.50 గ్రోయింగ్​ చార్జీలు మాత్రమే దక్కుతున్నాయి. పెరిగిన ధరలకు తగ్గట్టు గ్రోయింగ్ చార్జీని కిలోకు రూ.12 వరకు పెంచాలి. ఇందుకోసం మా యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున రైతులంతా పోరుబాట పట్టాలని నిర్ణయించాం.
- వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, బ్రాయిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోళ్ల ఫాం యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర నేత, గద్వాల జిల్లా