
డీజీపీ రవి గుప్తా దంపతులకు ఇబ్బంది కలిగించినందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. రూ.లక్ష జరిమానాతో పాటు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని ఫోరం గురువారం ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ రవిగుప్తా, ఆయన భార్య అంజనీ గుప్తా 2023 మే నెలలో ఆస్ట్రేలియా వెళ్లారు. సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లే సింగపూర్ ఎయిర్ లైన్స్ లో బిజినెస్ కేటగిరీలో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. మే 23న హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు బయల్దేరారు.
బిజినెన్ కేటగిరీలో వారికి కేటాయించిన సీట్లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆటోమెటిక్‌గా రిక్లైన్ కావాలి. కానీ, సాంకేతిక సమస్య కారణంగా సీట్లు సరిగా పనిచేయలేదు. ఎక్కువ మొత్తంలో చెల్లించి బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నా అందుకు తగ్గ సదుపాయాలు పొందలేకపోయామని, ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరంలో డీజీపీ దంపతులు ఫిర్యాదు చేశారు. ప్రయాణంలో వెన్నునొప్పి కారణంగా రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని తెలిపారు. వారి ఫిర్యాదుపై విచారణ వినియోగదారుల ఫోరం విచారణ జరిపింది. టికెట్ ధరతోపాటు 12 శాతం అదనంగా డీజీపీకి చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ ఫోరం తీర్పు చెప్పింది. అలాగే ఫిర్యాదుదారుల ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది.