అరుణాచల్​లో సరిహద్దు దాటిన చైనీస్ సోల్జర్లు

అరుణాచల్​లో సరిహద్దు దాటిన చైనీస్ సోల్జర్లు
  • మన జవాన్లు అడ్డుకోవడంతో ఫైటింగ్ .. రెండువైపులా కొందరికి గాయాలు 
  • వెంటనే ఇరువైపులా వెనక్కి తగ్గిన బలగాలు..  కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి  

న్యూఢిల్లీ:  ఇండో– చైనా బార్డర్ లో మళ్లీ గొడవ జరిగింది. బార్డర్ దాటొచ్చిన చైనీస్ సోల్జర్లను మన జవాన్లు దీటుగా అడ్డుకోవడంతో ఫైటింగ్ చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద గత శుక్రవారం ఈ గొడవ జరిగినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గొడవలో ఇరువైపులా కొంతమంది జవాన్లకు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే అక్కడి నుంచి ఇరువైపులా బలగాలు వెనక్కి మళ్లాయని తెలిపాయి. ఘర్షణ అనంతరం బార్డర్ లో శాంతిని నెలకొల్పేందుకు ఉన్న మెకానిజం ప్రకారం.. చైనీస్ కమాండర్ తో తవాంగ్ సెక్టార్ లోని ఇండియన్ ఆర్మీ కమాండర్ ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి, చర్చలు జరిపినట్లు పేర్కొన్నాయి. రెండేండ్ల కిందట (2020, జూన్ లో) తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన గొడవ తర్వాత బార్డర్ లో టెన్షన్ నెలకొనడం మళ్లీ ఇదే మొదటిసారి. గల్వాన్ గొడవలో మన జవాన్లు 20 మంది చనిపోయారు. తమ వైపు ఎంత మంది చనిపోయారని చైనా చెప్పకపోయినా, దాదాపు 40 మందికిపైగానే మృతిచెంది ఉంటారన్న వార్తలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య మిలిటరీ కమాండర్ ల స్థాయిలో అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. లడఖ్ లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ఏరియాలోని కీలక పాయింట్ల నుంచి ఇరువైపులా బలగాలు వెనక్కి మళ్లాయి.   

2006 నుంచీ ఇంతే.. 

ఎల్ఏసీ వెంబడి 2006 నుంచే చైనీస్ బలగాలు తరచూ బార్డర్ దాటి వస్తూ ఫైటింగ్ కు దిగుతున్నాయి. బార్డర్ వెంబడి తమ భూభాగాల పరిధి విషయంలో ఇరు దేశాల అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా తవాంగ్ సెక్టార్ లో బార్డర్ విషయంలో రెండువైపులా వేర్వేరు వాదనలు ఉన్నాయి. దీంతో తమ భూభాగం అని భావిస్తున్న ఏరియాలో రెండు దేశాల బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో 2006 నుంచే ఇక్కడ గస్తీలు ఘర్షణలకు దారి తీస్తున్నాయి. తాజాగా శుక్రవారం కూడా ఇలాగే రెండు దేశాల బలగాలు ఎదురుపడి కొట్లాట జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ 
వర్గాలు చెప్తున్నాయి.