జ‌గ్గారెడ్డివి …గాలి మాటలు, తుపాకీ రాముని చేష్టలు

జ‌గ్గారెడ్డివి …గాలి మాటలు, తుపాకీ రాముని చేష్టలు

ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్. రాష్ట్రంలో అవగాహన లేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. కరోనా మహమ్మారి విజృంభిస్తే ప్రజల్లో ఉండకపోవడం బాధాకరమ‌న్నారు. సీఎం కేసీఆర్ కరోనాపై తీసుకుంటున్న చర్యలను దేశం హర్షిస్తోందని.. జగ్గారెడ్డి ఒక్కోసారి కేసీఆర్ ను పొగుడుతారు.. మ‌రోసారి విమర్శిస్తారని తెలిపారు. సొంత పార్టీ నేతలపైన కూడా విమ‌ర్శ‌లు చేసే జ‌గ్గారెడ్డివి …గాలి మాటలు, తుపాకీ రాముని చేష్టలు అన్నారు.

కరోనాతో ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటున్నది తామేన‌ని… గాంధీభవన్ లో కూర్చుని, ప్రగతి భవన్ గురించి మాట్లాడటం విడ్డూరమ‌న్నారు. రైతుబంధు వంటి పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని.. మీడియా , సోషల్ మీడియాలో ఉంటూ జగ్గారెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. సంగారెడ్డికి ఎవరొచ్చినా అడ్డుకుంటానంటున్న జగ్గారెడ్డి.. సంగారెడ్డిలో ఎప్పుడైనా ఉంటే కదా అడ్డుకునేదన్నారు.

కరోనా వైరస్ సోకుతుందన్న ప్రాణ భయంతో సంగారెడ్డికి జగ్గారెడ్డి రావడం లేదని.. హరీష్ రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదన్నారు. ఉచిత సలహాలు ఇవ్వడం మాని, సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండల‌న్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం త్వరలోనే వస్తుందన్నారు చింత ప్ర‌భాక‌ర్.