అమెరికా వాణిజ్య శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం భారత సోలార్ పరిశ్రమపై పెను ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. భారత్, ఇండోనేషియా, లావోస్ దేశాల నుంచి దిగుమతి అవుతున్న సోలార్ సెల్స్, ప్యానెళ్లపై అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించింది. గత ఏడాది కాలంలో ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. ఇది మొత్తం అమెరికా సోలార్ దిగుమతుల్లో సుమారు మూడింట రెండు వంతులు. ఇంతటి భారీ మార్కెట్‌పై ఇప్పుడు టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించడం భారత వ్యాపార సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.
భారత్ నుంచి వచ్చే దిగుమతులపై అత్యధికంగా 123.04% డ్యూటీ విధిస్తోంది అమెరికా. అలాగే ఇండోనేషియాపై 35.17%, లావోస్‌పై 22.46% చొప్పున సుంకాలు పడ్డాయి. ఈ దేశాలు తక్కువ ధరలకే సోలార్ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో 'డంప్' చేస్తూ.. అక్కడి స్థానిక కంపెనీలైన ఫస్ట్ సోలార్, క్యూ సెల్స్ వంటి వాటికి నష్టం కలిగిస్తున్నాయని అలయన్స్ ఫర్ అమెరికన్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడ్ ఆరోపించింది. ఫిబ్రవరిలోనే అమెరికా ఈ దేశాలపై కౌంటర్ వేయిలింగ్ డ్యూటీలను కూడా విధించింది. ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీలు తోడవడంతో భారత ఎగుమతిదారులపై భారం రెట్టింపు కానుంది.
అమెరికా నిర్ణయం భారత సోలార్ ఎగుమతిదారులకు పెద్ద ఎదురుదెబ్బే. 123% కంటే ఎక్కువ సుంకం అంటే.. అమెరికా మార్కెట్లో భారత సోలార్ ప్యానెళ్ల ధరలు భారీగా పెరిగిపోతాయి. దీనివల్ల అక్కడి కొనుగోలుదారులు భారత ఉత్పత్తులపై తక్కువ ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంది. భారతీయ కంపెనీలైన వారీ ఎనర్జీస్, అదానీ సోలార్ వంటివి ఇప్పటికే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.
భారత్‌లో సోలార్ ప్యానెళ్లకు దేశీయంగానే భారీ డిమాండ్ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం అంటున్నారు నిపుణులు. ఎగుమతులు తగ్గినా.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ALMM నిబంధనలు, PLI స్కీమ్స్ వల్ల దేశీయ మార్కెట్ ఈ నష్టాన్ని కొంతవరకు సెటాఫ్ చేయగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా వంటి కీలక మార్కెట్‌లో పోటీతత్వాన్ని కోల్పోవడం వల్ల భారత తయారీదారులు ఇప్పుడు యూరప్, ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూలై 13న భారత్, ఇండోనేషియాలకు సంబంధించి అమెరికా తుది నిర్ణయాన్ని వెలువరించనుంది. ఆ నిర్ణయం భారత సోలార్ ఇండస్ట్రీ భవిష్యత్ కీలక నిర్థేశంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు.

