బాలీవుడ్ వెండితెరపై తన నటన, గ్లామర్ తో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన నటి కాజోల్. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌తో ఆమె జంట అంటే ప్రేక్షకులకు ఇప్పటికీ ప్రాణం. 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే తన మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎప్పుడూ ఒక కఠినమైన నిబంధనను పాటించేవారు. అదే 'నో కిస్సింగ్ పాలసీ'. అయితే, అనూహ్యంగా ఆమె తన ఓటీటీ అరంగేట్రం 'ద ట్రయల్' కోసం ఈ రూల్‌ను బ్రేక్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది.
అసౌకర్యంగానే ఆ పని చేశా..
లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద సన్నివేశం వెనుక ఉన్న అసలు రహస్యాలను కాజోల్ బయటపెట్టారు. తెరపై ముద్దు సీన్ చేయడానికి తాను మానసికగా ఎంతో సంఘర్షణకు గురైనట్లు తెలిపారు. నిజం చెప్పాలంటే, కథ విన్నప్పుడు ఆ సీన్ బాగుంటుందనిపించింది. కానీ షూటింగ్ రోజు సెట్స్‌పై నిలబడ్డప్పుడు మాత్రం నాకు చాలా చాలా అసౌకర్యంగా అనిపించిందని తెలిపారు.
చివరి నిమిషంలో వద్దు అని చెప్పేద్దామా అని కూడా అనుకున్నాను. కానీ అది కేవలం ఒక కిస్ మాత్రమే కాదు, నేను పోషించిన 'నోయనికా సేన్‌గుప్తా' పాత్రలో భావోద్వేగాలకు అది ప్రాణం. ఆ సీన్ లేకపోతే ఆ క్యారెక్టర్‌లోని డెప్త్ మిస్ అవుతుంది. అందుకే ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా ఆ నిర్ణయం తీసుకున్నాను అని కాజోల్ వివరించారు.
అగ్ర నాయికగా..
1992లో 'బేఖుదీ' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన కాజోల్, బాజీగర్, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో అగ్రస్థానాన్ని చేరుకున్నారు. ముఖ్యంగా షారుఖ్‌తో ఆమె నటించిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 1999లో నటుడు అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె తన ఇమేజ్‌కు భంగం కలగకుండా పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు.
►ALSO READ | తమన్నా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా.. బాలీవుడ్ సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!
'ద ట్రయల్'
హాలీవుడ్ సిరీస్ 'ది గుడ్ వైఫ్' ఆధారంగా రూపొందిన ఈ లీగల్ డ్రామాలో కాజోల్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. తన భర్త (జీషూ సేన్ గుప్తా) ఒక స్కాండల్‌లో ఇరుక్కొని జైలుకు వెళ్లినప్పుడు, ఒక గృహిణి మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కి తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకుందనేదే ఈ సిరీస్ కథ. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కాజోల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 'ద ట్రయల్' రెండవ సీజన్ 19 సెప్టెంబర్ 2025న హాట్ స్టార్ లో రిలీజ్ అయింది.
ప్రస్తుతం కాజోల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. పలు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. నిబంధనలను పక్కనబెట్టి, పాత్ర కోసం ఆమె చేసిన ఈ సాహసంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధతను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

