ముంబై: ఆహార కల్తీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనీర్‌కు ప్రత్యామ్నాయంగా వంటకాల్లో ఉపయోగించే చీజ్ అనలాగ్ వాడకాన్ని తప్పనిసరిగ్గా కస్టమర్లకు ముందే తెలియజేయాలని ఆదేశించింది. 2026, మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఒకవేళ పనీర్‌కు బదులుగా చీజ్ అనలాగ్‌ను ఉపయోగిస్తే ఆ విషయాన్ని తప్పనిసరిగా ముందే కస్టమర్లకు తెలియజేయాలని ఆదేశించింది. మెనూలు, బిల్లులు, డిస్‌ప్లేలలో ప్రత్యామ్నాయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో పనీర్‌కు బదులుగా చౌకైన చీజ్ అనలాగ్‌ను ఉపయోగిస్తున్నారని కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆహార భద్రతా చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫుడ్ లైసెన్సులను క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
పనీర్‌ను పోలి ఉండే చీజ్ అనలాగ్‌ను వెజిటేబుల్ ఆయిల్, ఇతర నాన్ మిల్స్ ఐటెమ్స్‌తో తయారు చేస్తారు. పనీర్ ధర ఎక్కువగా ఉండటంతో చౌకగా లభ్యమయ్యే చీజ్ అనలాగ్‌ను హోటళ్లు, రెస్టారెంట్లలో పనీర్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. పనీర్ పేరుతో చీజ్ అనలాగ్ ఉపయోగించి హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు తమను మోసం చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనీర్‌కు బదులు చీజ్ అనలాగ్ ఉపయోగిస్తే ఆ విషయాన్ని ముందే కస్టమర్లకు తెలియజేయాలని నిబంధనలు తీసుకొచ్చింది.
►ALSO READ | టోల్ బాదుడు నుంచి తప్పించుకోవాలా? ఈ 5 FASTag ట్రిక్స్‌తో డబ్బు ఆదా చేస్కోండి
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఒక వంటకంలో పాల నుండి తీసిన సహజ పనీర్‌కు బదులుగా చీజ్ అనలాగ్ ఉపయోగిస్తే హోటళ్లు, క్యాటరర్లు ఆ విషయాన్ని వినియోగదారులకు తప్పనిసరిగా ముందే తెలియజేయాలి. సరఫరాదారులకు కూడా ఇన్‌వాయిస్‌లపై చీజ్ అనలాగ్ అని స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.
ప్రజారోగ్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి జిర్వాల్ హెచ్చరించారు. తాము చెల్లించే డబ్బులకు ఏమి అందిస్తున్నారో కచ్చితంగా తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని ఆయన నొక్కిచెప్పారు. పనీర్ పేరుతో జరిగే మోసపూరిత పద్ధతులను సహించబోమని పేర్కొన్నారు.

